చిత్రం: లాభం
నటీనటులు: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి దన్సిక, రమేశ్ తిలక్, కలైరసన్ తదితరులు
సంగీతం: డి ఇమాన్
సినిమాటోగ్రఫీ: రామ్‌జీ
ఎడిటింగ్: ఎన్.గణేశ్ కుమార్, ఎస్పీ అహ్మద్
నిర్మాత: పి. ఆర్ముగం కుమార్, విజయ్ సేతుపతి
దర్శకత్వం: ఎస్.పి.జననాథ్
విడుదల: 09-09-2021
తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. గతంలో ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యేవి. టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతుండటం, విలక్షణ పాత్రల కోసం దర్శక-నిర్మాతలు విజయ్ సేతుపతి(vijay sethupathi new movie)లాంటి నటులవైపు మొగ్గు చూపుతున్నారు. అలా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్ సేతుపతి నటించిన తాజా తమిళ చిత్రం 'లాభం'. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా తెలుగులోనూ విడుదల చేశారు. తనదైన భావజాలంతో సినిమాలు తీసే దర్శకుడిగా పేరున్న జననాథన్ చివరి చిత్రం ఇది. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. జననాథన్ శిష్యులే నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. మరి ఈ సినిమా కథేంటి? విజయ్ సేతుపతి ఎలా నటించారు? అనే విషయాల్ని సమీక్ష(laabam movie review) ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే?
పండూరు రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు బద్రి (విజయ్ సేతుపతి). రైతు సంఘాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆ ఊరు భూములపైనా, రైతులపైనా అధికారాన్ని చెలాయిస్తున్న వ్యాపారవేత్త నాగభూషణం (జగపతిబాబు). అతని స్నేహితులకి బద్రి ఒక పట్టాన మింగుడుపడడు. ఎలాగైనా బద్రిని దెబ్బ కొట్టాలని పన్నాగం పన్నుతారు. కానీ బద్రి మాత్రం తన స్నేహితులైన కొద్దిమంది యువకులతో కలిసి కొత్తతరహా సేద్యానికి నడుం బిగిస్తాడు. ఉమ్మడి వ్యవసాయం గొప్పతనమేమిటో చాటి చెబుతాడు. అదే క్రమంలో కొద్దిమంది చేతుల్లో ఉన్న ఇనాం భూముల్ని తీసుకుని ఊరి జనానికి పంచి పెడతారు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? బయో డీజిల్ కంపెనీ పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న నాగభూషణం ఏం చేశాడు? బద్రికీ, నాగభూషణంకీ మధ్య సాగిన పోరాటంలో ఎవరు గెలిచారు?
ఎలా ఉందంటే?
స్వల్పకాలంలో లాభాలు పొందాలనే పెట్టుబడిదారుల దురాశ సమాజంపై ఎంతటి విష ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని దర్శకుడు తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. ‘లాభం’ అంటే ఏమిటో ప్రత్యేకంగా తనదైన భావజాలంతో దర్శకుడు చెప్పిన విధానం ఆలోచన రేకెత్తించేలా ఉన్నా ఆ సన్నివేశాలు మరీ ప్రసంగంలా అనిపిస్తాయి. ఉమ్మడి వ్యవసాయం, పండించే రైతులకి గిట్టుబాటు ధర తదితర అంశాల్ని స్పృశిస్తూ సినిమా ఆరంభం అవుతుంది. అవి ఇదివరకటి సినిమాల్లో చూసేసిన సన్నివేశాలే. ఎప్పుడైతే రైతు సంఘం నేపథ్యంలో డ్రామా మొదలవుతుందో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. కానీ, కథానాయకుడు అన్ని విషయాల్లో ఆరితేరిన వ్యక్తిగా కనిపించడం, ఎత్తుకు ముందే పైఎత్తు వేయడం, వేల కోట్లు ఉన్న పెట్టుబడిదారుల్ని ఒక ఐదుగురు స్నేహితులతో కలిసి ఎదిరించడం ఏమాత్రం సహజంగా అనిపించదు. కొన్ని పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం, ఇందులో చెప్పిన కొన్ని విషయాలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. సింహ భాగం సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఇనాం భూముల వెనక చరిత్ర, రైతులు ఇంకా పేదవాళ్లుగా మిగిలిపోవడానికి కారణాల్ని ఓ సమాచారంలా చెప్పడం సినిమాకి అంతగా అతకలేదు. కథనం పరంగా ఏమాత్రం ప్రభావం చూపించదు. ఒక సమస్య నుంచి మరో సమస్యకి వెళ్లిపోతూ ఉంటాడు కథానాయకుడు. పాత్రలు కూడా అర్ధాంతరంగా మాయమవుతుంటాయి. పతాక సన్నివేశాలు పెద్దగా మెప్పించవు. డబ్బింగ్‌లో నాణ్యత లేకపోవడం వల్ల తమిళ సినిమా చూసినట్టే ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
విజయ్ సేతుపతి తనదైన శైలిలో నటించారు. చాలా సన్నివేశాల్లో బలం లేకపోయినా ఆయన నటనాశైలి వాటిని నిలబెట్టింది. శ్రుతిహాసన్ పాత్ర ఏమాత్రం ప్రభావం చూపించదు. మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోతుంది. జగపతిబాబు పెట్టుబడిదారుడిగా కనిపిస్తారు. ఆయన పాత్రకి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం చాలా కృతకంగా అనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా, సంగీతం విభాగాలు మెప్పిస్తాయి. నిడివి పరంగా ఎడిటింగ్ బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కథనంలో సత్తా లేకపోవడం, నిడివి మరీ ఎక్కువ కావడంతో సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు జననాథన్ మరణానంతర వచ్చిన సినిమా ఇది. ఆయన ఎంచుకున్న అంశం మెచ్చుకోదగ్గదే. చాలా విలువైన విషయాల్ని సినిమాతో చెప్పినా ప్రేక్షకుడికి సినిమా అనుభవాన్ని ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యారు.
బలాలు
విజయ్ సేతుపతి నటన
కథ
బలహీనతలు
కథనం, భావోద్వేగాలు పండకపోవటం
డబ్బింగ్ పరంగా నాణ్యత లేకపోవడం
చివరిగా: 'లాభం' అంతంత మాత్రమే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">