- చిత్రం: వి
- నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు
- సంగీతం: అమిత్ త్రివేది
- నేపథ్య సంగీతం: తమన్
- నిర్మాత: దిల్‌రాజు
- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
- విడుదల: 05-09-2020(అమెజాన్ ప్రైమ్)
యువ కథానాయకుడు నాని చిత్రాల ఎంపిక తొలి నుంచి విభిన్నమైనదే. 'అష్టా చమ్మా'తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం చూస్తుండగానే 'వి'తో 25 చిత్రాల మైలురాయిని చేరుకుంది. ఏ దర్శకుడితో అయితే, నాని సినీ కెరీర్ మొదలైందో అదే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తన 25వ చిత్రంలో నటించడం యాదృచ్ఛికమే. అందులోనూ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర పోషించడంతో 'వి'పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మరో యువ కథానాయకుడు సుధీర్‌బాబు కీలక పాత్ర పోషించడం కూడా ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది ఉగాదికి థియేటర్‌లలో సందడి చేయాల్సి ఈ చిత్రం కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఓటీటీ బాటపట్టింది. మరి అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన 'వి' ఎలా ఉంది? ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నాని మెప్పించారా? అసలు 'వి' వెనుక ఉన్న కథేంటి?
కథేంటంటే:
డీసీపీ ఆదిత్య(సుధీర్‌బాబు) దమ్మున్న, స్టైలిష్ పోలీస్ ఆఫీసర్. అతి తక్కువ సమయంలోనే ఎన్నో కేసులను ఛేదించి పోలీసు గ్యాలంట్రీ మెడల్‌ను అందుకుంటాడు. సహచర పోలీసులందరికీ పార్టీ ఇస్తుండగా 'మీ అభిమానిని' అంటూ అపూర్వ(నివేదా థామస్) ఆదిత్యతో పరిచయం పెంచుకుంటుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అదే రోజు రాత్రి ఇన్‌స్పెక్టర్ వీర ప్రసాద్ దారుణ హత్యకు గురవుతాడు. హంతకుడు(నాని) డీసీపీ ఆదిత్యకు ఒక క్లూ వదలి వెళతాడు. అంతేకాదు, మరో నాలుగు హత్యలు చేస్తానని కూడా చెబుతాడు. చెప్పినట్లుగానే ఒకొక్కర్నీ చంపడం మొదలుపెడతాడు. ఆ హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? హత్యలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ క్రమంలో హంతకుడిని పట్టుకోవడానికి డీసీపీ ఆదిత్య ఏం చేశాడు? విష్ణు(నాని), సాహెబా(అదితి రావు హైదరీ)కీ ఈ హత్యలకు సంబంధం ఏంటి? తెలియాలంటే 'వి' చూడాల్సిందే!
ఎలా ఉందంటే:
చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడిది ఒక్కోశైలి. కొందరు మాస్ కమర్షియల్ చిత్రాలు తీస్తే, మరి కొందరు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలు తీస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణది ప్రత్యేకశైలి. ఆయన తీసిన ఒక చిత్రానికీ మరో చిత్రానికీ పోలికే ఉండదు. ఈసారి ఇంకాస్త ముందడుగు వేసి యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకుని, కథానాయకులుగా నాని, సుధీర్‌బాబులను తీసుకున్నారు. ఒక నగరంలో వరుస హత్యలు, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కథానాయకుడు వాటిని ఛేదించడం ఈ కథతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. తెలిసిన కథే అయినా, కథనాన్ని ఎంత ఉత్కంఠగా నడిపామన్న దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు ఇంద్రగంటి గట్టి ప్రయత్నమే చేశారు.
డీసీపీ ఆదిత్య స్టామినా ఏంటో తెలిపేలా ఫైట్ సన్నివేశంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు.. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ హత్యతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. హంతకుడు ఒక్కో వ్యక్తిని హత్య చేసుకుంటూ వెళ్లడం, ఆ హత్యలను ఛేదించేందుకు డీసీపీ ఆదిత్య ప్రయత్నాలు చేయడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది. డీసీపీ-హంతకుడి మధ్య సవాల్ విసిరే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి. అయితే, మధ్య మధ్యలో అపూర్వ-ఆదిత్యల మధ్య ప్రేమ సన్నివేశాలు మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తాయి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరింత ఉత్కంఠగా సాగుతాయి. డీసీపీకి హంతకుడు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటాడు.
ద్వితీయార్ధానికి వచ్చే సరికి కథాగమనం కాస్త నెమ్మదించింది. హంతకుడు తన పేరు విష్ణు(నాని) అంటూ ఒక క్లూ ఇచ్చి వెళతాడు. దీంతో అసలు విష్ణు ఎవరు? అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు డీసీపీ ఆదిత్య. ఇక్కడ ఒక విషయాన్ని విస్మరించాడు దర్శకుడు. పరిచయ సన్నివేశాల్లో తెలివైన, బలవంతుడైన పోలీసుగా ఆదిత్యను చూపించిన దర్శకుడు... హంతకుడు క్లూస్ ఇస్తే కానీ అతన్ని పట్టుకోలేడా? అన్న అనుమానం చూసే ప్రేక్షకుడిలో కలుగుతుంది. దీనికి తోడు విష్ణు ఫ్లాష్‌బ్యాక్ కూడా రొటీన్‌గా సాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగలడు. విష్ణు హత్య చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఇప్పటికే కొన్ని వందల చిత్రాల్లో మనం చూశాం. అందులో కొత్తదనం ఏమీ ఉండదు. క్లైమాక్స్‌లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ద్వితీయార్థంలో ఇంకాస్త బలంగా, ఉత్కంఠ కలిగించేలా సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే:
ప్రతి హీరోకు తన కెరీర్‌లో 25వ చిత్రాన్ని ప్రత్యేకంగా, విభిన్న పాత్రలో చేయాలని అనుకోవడం సహజం. అందుకు తగినట్లుగానే నాని ఈ పాత్ర ఎంచుకున్నారు. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నాని నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా డైలాగ్ డిక్షన్, హావభావాలు కొత్తగా ప్రయత్నించారు. రైలులో గెటప్ శ్రీనుతో, బస్సులో మరో వ్యక్తితోనూ నాని పలికే సంభాషణలు, ముఖంలో చూపించే వేరిషయన్స్ ఆకట్టుకుంటాయి. ఇక సుధీర్‌బాబు డీసీపీ ఆదిత్య పాత్రలో ఒదిగిపోయారు. ప్రథమార్ధంలో నాని-సుధీర్‌బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి. నివేదా థామస్, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు తమ ప్రాతల పరిధి మేరకు నటించారు.
అమిత్ త్రివేది ఇచ్చిన పాటలు బాగున్నాయి. 'వస్తున్నా.. వచ్చేస్తున్నా', 'మనసు మరీ' పాటలు వినడానికీ, స్క్రీన్‌పై చూడటానికి అలరించేలా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు బలం. ముఖ్యంగా నాని-సుధీర్‌బాబుల మధ్య వచ్చే సన్నివేశాల్లో సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ పర్వాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ఓటీటీ వేదికల్లో పాటలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు. క్లైమాక్స్ ముందు వచ్చే ఐటమ్ సాంగ్‌కు కత్తెర వేసినా కథాగమనంలో పెద్దగా మార్పేమీ ఉండదు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. గతంలో ఈ తరహా కథ, కథనాలతో అనే సినిమాలు వచ్చాయి. అయితే, ప్రథమార్ధం ఉన్నంత ఉత్కంఠగా ద్వితీయార్ధం లేదు. అక్కడ కూడా బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది.
బలాలు
- నాని, సుధీర్‌బాబుల నటన
- ప్రథమార్ధం
- నేపథ్య సంగీతం
బలహీనతలు
- తెలిసిన కథే కావడం
- నెమ్మదించిన ద్వితీయార్ధం
చివరిగా: నానిలో మరో కొత్త కోణం 'వి'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">