చిత్రం: మరో ప్రస్థానం; తారాగణం: తనీష్, రిషికా ఖన్నా, భాను శ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు, తదితరులు; మాటలు: వసంత కిరణ్, యానాల శివ; పాటలు: ప్రణవం; సంగీతం: సునీల్ కశ్యప్; ఛాయాగ్రహణం: ఎంఎన్ బాల్ రెడ్డి; ఎడిటర్: క్రాంతి (ఆర్కే); సమర్పణ: ఉదయ్ కిరణ్; నిర్మాణం: మిర్త్ మీడియా; రచన దర్శకత్వం: జానీ; సంస్థ: హిమాలయ స్టూడియో మాన్షన్స్; విడుదల: 24 సెప్టెంబర్ 2021
యాక్షన్ ప్రధాన కథతో యువ కథానాయకుడు తనీశ్ చేసిన చిత్రం 'మరో ప్రస్థానం'(Maro Prasthanam Review). 'వన్ షాట్' కమర్షియల్ చిత్రంగా ప్రచారమై ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సరైన విజయం కోసం ఎదురు చూస్తోన్న తనీష్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చింది..? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: శివ(తనీశ్) ఓ క్రిమినల్. ముంబయిలోని ఓ గ్యాంగ్‌లో చేరి నేరాలకు పాల్పడుతుంటాడు. ఆ గ్యాంగ్‌కు లీడర్ రాణె భాయ్(కబీర్ దుహాన్ సింగ్). పిల్లల కిడ్నాప్‌లు, పేలుళ్లు, అత్యాచారాలు.. ఇలా రాణె భాయ్ చేయని నేరమంటూ ఉండదు. నైనిని(రిషికా ఖన్నా) చూసి ప్రేమలో పడిపోయిన శివ తన నేరమయ జీవితాన్ని వదిలేసి కొత్త ప్రయాణం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో తన గ్యాంగ్ పేలుళ్లకు కుట్ర పన్నుతుంది. ఎలాగైనా ఆ పేలుళ్లను ఆపాలనుకుంటాడు శివ. మరోవైపు జర్నలిస్ట్ సమీర (భానుశ్రీ మెహ్రా) ఈ గ్యాంగ్ చేసిన నేరాల గురించి ఓ రిపోర్ట్ తయారు చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాణె భాయ్ గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేస్తుంది. శివ ఆమెను కూడా తప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. మరి అది సాధ్యమైందా? పేలుళ్ల కుట్రను శివ ఆపగలిగాడా?లేదా?అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: రెండు గంటల్లో జరిగే కథ ఇది. ఈ సినిమా నిడివి కూడా అంతే. సింగిల్ షాట్ ప్యాటర్న్‌లో తీశారు. ఓ యాక్షన్ కథను ఈ తరహాలో తీయడమే ఈ సినిమా ప్రత్యేకత. కథ చెప్పడం కంటే కూడా ఓ కొత్త తరహా ప్రయత్నం చేయాలనే తపనే ఎక్కువగా కనిపించింది చిత్రబృందంలో. ఇందులో పాత్రలన్నీ కెమెరా కోణంలోనే సాగుతుంటాయి.
హీరో సీక్రెట్ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగినప్పట్నుంచి కథ మొదలవుతుంది. ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుల్ని నేరుగా కథలోకి తీసుకెళతాయి. కెమెరా రన్ అవుతుంటే.. పాత్రలు వచ్చి వెళుతుంటాయి. సినిమాలా కాకుండా.. నిజంగా ఓ చోట జరుగుతుంటే రహస్యంగా కెమెరాతో షూట్ చేశారనిపిస్తుంది. అయితే కథలో బలం లేకపోవటం వల్ల క్రమంగా సన్నివేశాలు తేలిపోతాయి. మధ్యమధ్యలో పాటలు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు.. ఇది కూడా సగటు సినిమానే అనిపిస్తుంది.
కథలో కొత్తదనం లేదు, కథనం నడిపిన తీరు కూడా అంతగా మెప్పించదు. యాక్షన్ ఘట్టాలు మాత్రం ఆకట్టుకుంటాయి. నటీనటులు, సాంకేతిక బృందం పడిన కష్టం మాత్రం కొన్ని సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రేమకథ మాత్రం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే: తనీశ్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. ఆయన చేసిన పోరాటఘట్టాలు కూడా మెప్పిస్తాయి. ముస్కాన్ గ్లామర్‌తో కూడిన పాత్రలో తనీశ్‌పై ప్రేమను ప్రదర్శించే అమ్మాయిగా సందడి చేసింది. తనీశ్, రిషికా ఖన్నా మధ్య ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భానుశ్రీ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సునీల్ కశ్యప్ సంగీతం చిత్రానికి బలాన్నిచ్చింది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటింగ్ విభాగం కూడా చక్కటి పనితీరును కనబరిచింది. దర్శకుడు జానీ ఓ కొత్త రకమైన ప్రయత్నం చేశారు.
బలాలు
- తనీశ్ నటన
- కొన్ని పోరాట ఘట్టాలు
- సునీల్ కశ్యప్ సంగీతం
- బలహీనతలు
కథనం
- హింసాత్మక సన్నివేశాలు
చివరిగా: ఓ కొత్త ప్రయత్నంగా.. మరోప్రస్థానం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Love Story Review: 'లవ్‌స్టోరి' సినిమా ఎలా ఉందంటే?