సోషల్ మీడియా వేదికగా మరో సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) ప్రధానపాత్రలో నటించిన 'తూఫాన్'(Toofaan) చిత్రం గతకొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఒక గ్యాంగ్‌స్టర్ బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యాడు.. ఆ తర్వాత బాక్సింగ్‌కు ఎందుకు దూరమయ్యాడు అనే కథాంశంతో డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా(Rakeysh Omprakash Mehra) ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పరేశ్‌రావల్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
'భాగ్ మిల్కా భాగ్'(Bhaag Milkha Bhaag) తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కలయికలో వస్తున్న చిత్రమిది. దీంతో 'తూఫాన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 16 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ విశేషాదరణ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ట్విటర్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది నెటిజన్లు 'Boycott Toofaan' అనే పేరుతో సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
ఈ సినిమాలో అజిజ్ అలీగా ఫర్హాన్ అక్తర్, పూజా షా పాత్రలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కనిపించనున్నారు. వీరిద్దరూ ఈ సినిమాలో వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇలాంటి మతాంతర కథలతో తెరకెక్కిన సినిమాను ప్రోత్సహించవద్దని, ఇలాంటి వివాహాల వల్ల చాలామంది అసౌకర్యంగానే ఉన్నారని, ఇవి భారత సంప్రదాయానికి విరుద్ధమంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. గతంలో ఫర్హాన్ అక్తర్ సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానిపై స్పందిస్తూ.. తన గొంతు వినిపించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సినిమాపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. Sai Dharam Tej: త్వరలోనే థియేటర్లలోకి 'రిపబ్లిక్'