ఏడాది చివరికి వచ్చేశాం. కొత్త సంవత్సరంలో కొత్త సినిమాలు చూసేందుకు రెడీ అయిపోతున్నాం. కానీ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఈ ఏడాది ట్విట్టర్లో ఏ సినిమా గురించి ఎక్కువ ట్వీట్లు చేశారు? సెలబ్రిటీల్లో ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు?
ట్విట్టర్ సంస్థ ఈ ఏడాదికిగానూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన సినిమా, సెలబ్రిటీల గణాంకాలు విడుదల చేసింది. అందులో తెలుగు నుంచి 'వకీల్‌సాబ్', 'సర్కారు వారి పాట' సినిమాలు ఉండటం విశేషం.
అత్యధిక ట్వీట్లు
'మాస్టర్' సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలో హిట్ కొట్టిన తమిళ హీరో విజయ్.. 'బీస్ట్' అని కొత్త సినిమా చేస్తున్నట్లు చెబుతూ జూన్‌లో ఫస్ట్‌లుక్‌ను ట్వీట్ చేశారు. ఇది మోస్ట్ లైక్డ్ ట్వీట్, రీట్వీటెడ్గా నిలిచింది. గతేడాది కూడా విజయ్ ఫ్యాన్స్‌తో తీసుకున్న సెల్ఫీనే ఈ ఘనత సాధించడం విశేషం.
'సర్కారు వారి పాట' షూటింగ్ తిరిగి ప్రారంభమైందని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పెట్టిన ట్వీట్.. మోస్ట్ కోట్-రీట్వీటెడ్గా నిలిచింది.
అలానే దక్షిణాదికి చెందిన మాస్టర్, వాలిమై, బీస్ట్, జై భీమ్, వకీల్‌సాబ్ సినిమాలు గురించే ఈ ఏడాది ఎక్కువగా చర్చించారని ట్విట్టర్ వెల్లడించింది.
"ట్విట్టర్లో ఈ ఏడాది తెలుగు, తమిళ సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. గత రెండేళ్ల నుంచి ఇలానే జరుగుతుంది" అని ట్విట్టర్ తెలిపింది.
సోనూసూద్ అగ్రస్థానంలో
బాలీవుడ్ సెలబ్రిటీల్లో సోనూసూద్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు.
బాలీవుడ్ లేడీ సెలబ్రిటీల్లో ఆలియా భట్ టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, గంగూబాయ్ కతియావాడి లాంటి పాన్ ఇండియా సినిమాలు ఉండటమే ఇందుకు కారణం.
టీవీ ఇండస్ట్రీలో అయితే హిందీ 'బిగ్‌బాస్'.. మోస్ట్ ట్వీటెడ్ షోగా వరుసగా మూడో ఏడాది నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబరులో సడన్‌గా మరణించిన సిద్ధార్థ్ శుక్లా.. మోస్ట్ ట్వీటెడ్ బిగ్‌బాస్ పర్సనాలిటీగా నిలిచారు.
ఇవీ చదవండి: