హీరో విజయ్ దేవరకొండకు జీవితంలో తొలిప్రాధాన్యం ఎవరు? ఏయే ప్రదేశాలంటే ఇష్టం? ప్రేమపై తనకున్న అభిప్రాయం ఏంటి? టైంపాస్ కోసం ఏం చేస్తాడు? తదితర విశేషాల సమాహారమే ఈ కథనం. అతడి 33వ వసంతంలోకి అడుగుపెట్టారు.
యువహీరో విజయ్ దేవరకొండ.. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా కథతో, దర్శకుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో ఈనాడుతో ముచ్చటించినప్పుడు ఈ కథానాయకుడు.. తన ఇష్టాలు, నచ్చిన ప్రదేశాలు, ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
మొదటి ప్రాధాన్యం వారికే
జీవితంలో మా అమ్మ, నాన్న, తమ్ముడికే తొలి ప్రాధాన్యం ఇస్తా. వాళ్ల ముందు నేను నటుడిని కాదు. సాధారణ విజయ్ లేదా చిన్ను అంతే. అందుకే ఏ మాత్రం తీరిక దొరికినా వాళ్లతో గడిపేందుకు ఇష్టపడతా. వాళ్ల తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్, నన్ను డీవీఎస్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం న్యూయర్‌ను వారితో చేసుకోవడమే ఇష్టం. నేనెప్పుడూ ఫ్రీగా ఉన్న వాళ్లు నా ఇంటికొస్తారు.
ప్రేమంటే
నా దృష్టిలో అదో అద్భుతమైన ఫీలింగ్. దానికోసం ప్రత్యేకంగా ప్రేమికుల దినోత్సవం అవసరం లేదు. ఎప్పుడైనా ఆ ఫీలింగ్‌ను ఆనందించొచ్చనేది నా భావన. నా అడ్రస్ ఎవరికీ తెలియదు కానీ.. వాచ్‌మెన్‌కి లవ్‌లెటర్స్ ఇచ్చేసి చాలామంది వెళ్లిపోతుంటారు. వాటన్నింటినీ పూర్తిగా చదువుతా. అలా చదవడం ఎంతో బాగుంటుంది.
టైంపాస్ అంటే
టైంపాస్ కావడానికి పుస్తకాలు చదువుతా. ఆ మధ్య మోస్సాడ్ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టా. తరువాత ట్యూజ్‌డేస్ విత్ మోరీ ఒకటి... అయితే అన్నీ పది పేజీల చొప్పున చదివి, పక్కన పెట్టేసి మరొకటి తీసుకుంటా. వాటన్నింటినీ ఎప్పుడో ఒకప్పుడు పూర్తిచేయాలి. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో ఆ దర్శకుడు నాగ్ అశ్విన్ ‘శాంతారం’ అనే పుస్తకం చదవమన్నాడు. కొని ఉంచా కానీ అది చాలా పెద్దగా ఉంది. ఏదో ఒక రోజు మొదలుపెట్టాలి.
బిర్యానీ అంటే ఇష్టం!
నేను వ్యాయామం పెద్దగా చేయను కానీ... ఆహారం విషయంలో మాత్రం చాలా శ్రద్ధ పెడతా. నా ఆహరంలో చక్కెర అసలు ఉండదు. ఎవరికైనా చక్కెర తీసుకోవద్దనే చెబుతా. అయితే హైదరాబాదీ దమ్ బిర్యానీని చూస్తే మాత్రం ఇష్టంగా లాగించేస్తా.
ఇష్టపడే సినిమా
ఇప్పుడు పూరీతో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ.. నాకు ముందునుంచీ 'పోకిరి' అంటే చాలా ఇష్టం
అభిమానించే నటులు
నాకు రణ్‌బీర్ కపూర్ నటన ఎంతో నచ్చుతుంది. అలాగే కొంతకాలం దీపికా పదుకొణె నటనను అభిమానించేవాడిని. ఇప్పుడు ఆలియాభట్ అంటే ఇష్టం. ఆమె చేసిన 'రాజ్' ,'గల్లీబాయ్' చూశాక ఎంత సూపర్‌గా చేస్తుందో అనిపిస్తోంది.
నచ్చే ప్రాంతం
ఫలానా అని లేదు కానీ... ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రాంతం ఏదయినా నచ్చుతుంది. ‘వరల్డ్‌ఫేమస్ లవర్’కోసం ప్యారిస్‌లో షూటింగ్ చేశాం. ఎండా చలీ మరీ విపరీతంగా లేవు. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి చోట్ల ఎన్ని గంటలైనా ఉండిపోవచ్చు. అదే విధంగా ముంబయి. నేల, సముద్రం పక్కపక్కన కనిపిస్తోంటే.. అలా చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది.