'టక్ జగదీశ్' వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ స్పందించింది. సినిమా విడుదలకు ఆలస్యం అవుతుండటం వల్లే 'టక్ జగదీశ్'ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదాల వల్ల సినిమా పట్ల ప్రేక్షకులకు ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉందని తెలిపారు.
"మా సంస్థ నుంచి వస్తున్న రెండో చిత్రం 'టక్ జగదీశ్'. ఇందులో హీరోగా నేచురల్ స్టార్ నానిని సంప్రదించాం. ఈ చిత్రం కోసం రెండేళ్లు శ్రమించాం. గత ఏడాది డిసెంబరులోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ వేసవికి విడుదల చేయాలని భావించినా.. కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఈ సినిమా కంటెంట్‌ను ఎక్కువ కాలం కాపాడుకోలేం. ఇవన్నీ ఆలోచించి.. మరో దారి లేనందు వల్లే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై మొదట నాని, దర్శకుడు అసంతృప్తి చెందినా.. పరిస్థితిని అర్థం చేసుకున్నారు. మా ఇబ్బందులను అర్థం చేసుకుని ఓటీటీ విడుదల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించిన నానికి మా ధన్యవాదాలు."
-నిర్మాతలు
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'టక్ జగదీశ్' అమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. అయితే విడుదల తేదీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
ఇదీ చదవండి : నానికి.. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ క్షమాపణలు!