'తెలుగు సినిమాల్లో నాయికలు పాడటానికే పరిమితం' అనే ఓ విమర్శ తరచూ వినిపించేదే. కథలు ఎక్కువగా కథానాయకుడి చుట్టూనే తిరుగుతుంటాయి కాబట్టి పాటలు, ఇతర కొన్ని సన్నివేశాల్లోనే హీరోయిన్లు కనిపిస్తుంటారు. తెరపై పరిమిత సన్నివేశాల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులపై ప్రభావం చూపడమూ ఓ కళే అంటుంది అగ్ర తార తమన్నా. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల విషయంలో నాయికలెప్పుడూ ఆకలితో ఉంటారు. నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ పాత్రలపై బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా ఇప్పుడు పలువురు భామలు కొత్త సవాళ్లని భుజానికెత్తుకున్నారు.
అనుష్క ప్రతి సినిమాకూ ఏదో ఒక కొత్త విద్యని నేర్చుకున్నాకే కెమెరా ముందుకు అడుగు పెడుతుంటుంది. సినిమాల కోసమే కత్తి పోరాటాలు, గుర్రపుస్వారీ.. ఇలా ఎన్నో నేర్చుకుందామె. త్వరలోనే విడుదల కానున్న 'నిశ్శబ్దం' కోసం సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) పాఠాలు నేర్చుకుని నటించింది. సినిమాలో సంభాషణలు లేకుండా సంజ్ఞలే చేస్తూ ఆమె నటించింది. మరి ఆ ప్రయత్నంతో ఆమె ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. అనుష్కనే కాదు, ఇతర నాయికలు ఇప్పుడు ఏదో ఒక కొత్త సవాల్ లేనిదే సెట్లో అడుగు పెట్టడం లేదు. 'చేస్తే బలమైన పాత్రలే చేద్దాం' అంటూ అనుకున్న కథలు వచ్చేవరకు చూస్తున్నారు.
విలనిజం
నాయిక సమంతకు వరుసగా విజయాలే. అవకాశాలకు ఎప్పుడూ కొదవ ఉండదు. అలాగని ఆమె ఏ కథ పడితే ఆ కథని ఒప్పుకోవడం లేదు. కొంతకాలంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ వచ్చిన ఆమె.. మరో అడుగు ముందుకేసి 'ద ఫ్యామిలీ మ్యాన్2' వెబ్ సిరీస్ కోసం వ్యతిరేక ఛాయలున్న పాత్రలోకి మారిపోయింది. తదుపరి ఆమె ఓ బయోపిక్‌లో నటించనున్నట్టు సమాచారం. ఆ చిత్రం కోసం పలు కొత్త విద్యలు నేర్చుకోనుంది. అందమైన పాత్రలు, ప్రత్యేక గీతాలతో అదరగొట్టిన తమన్నా మరో కొత్త కోణాన్ని చూపించబోతోంది. 'అంధాధున్' రీమేక్‌లో ఆమె వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలో సందడి చేయనుంది. 'సీటీమార్' సినిమా కోసం తమన్నా కబడ్డీ నేర్చుకుంది. ఇందులో ఆమె కబడ్డీ కోచ్‌గా నటిస్తోంది.
లంగా ఓణీ.. సెట్టై పోనీ
రష్మిక 'పుష్ప' సినిమాను ఓ సవాల్‌గానే తీసుకుంది. ఇందులోని పాత్ర కోసం కొన్ని రోజులుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. ఈమె కొన్ని సన్నివేశాల్లో లంగా ఓణీతో దర్శనమివ్వనుంది. చిత్తూరు యాస మాట్లాడేందుకు భాషపై పట్టు పెంచుకుంటోంది. ట్రెండీ పాత్రల్లో కనిపించిన రకుల్‌ప్రీత్ మరోసారి పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమె లంగా ఓణీతో దర్శనమివ్వబోతోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నటిస్తోంది.
అటు కాజల్... ఇటు పూజ
పూజాా హెగ్డేకూ కొత్త రకమైన పాత్రలు దక్కుతున్నాయి. ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్'లో నటిస్తోందామె. ఇందులో పూజ రెండు కోణాల్లో సాగే పాత్రలో కన్పిస్తుందని సమాచారం. కాజల్ ఇప్పుడు తన అనుభవానికి తగ్గట్టుగా కథల్ని ఎంచుకొంటోంది. అవకాశం వచ్చిన ప్రతిసారీ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరుస్తోంది. 'భారతీయుడు2'లో ఆమె కమల్ సరసన నటిస్తోంది. భారతీయుడికి జోడీగా అంటే ఆమె కూడా వయసు మళ్లిన పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి.
- అగ్రనాయికలే కాదు, యువతరం భామలూ వైవిధ్యానికే పెద్ద పీట వేస్తున్నారు. "యువతరం ప్రేక్షకులు వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథల్ని, పాత్రల్నే ఇష్టపడతారు. ప్రేక్షకుల్లో ఒకరిగా నేనూ అంతే. అందుకు తగ్గ పాత్రల్నే ఎంచుకుంటా" అంటోంది నాయిక రీతూ వర్మ. ఆమె 'కనులు కనులు దోచాయంటే'లో వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రతో మెప్పించింది.