హీరోలతో పోల్చితే నాయికల సినీ కెరీర్ పరిధి చాలా తక్కువ. అందుకే ఉన్న కొద్ది సమయంలోనే జెట్ స్పీడ్‌తో అన్ని భాషలు చుట్టొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పరభాషల్లో జోరు చూపించే క్రమంలోనో.. ఆచితూచి కథలు ఎంచుకునే ప్రయత్నాల్లోనో.. కొద్ది మంది నాయికలు అడపాదడపా తెలుగు చిత్రసీమ నుంచి గ్యాప్ తీసుకుంటుంటారు. అలాగని వాళ్లెప్పుడూ శాశ్వతంగా తెలుగు తెరకు దూరమవ్వాలనుకోరు. ఊరించే కథలు చేతికి చిక్కాయంటే చాలు.. మళ్లీ ఇక్కడ మెరుపులు మెరిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగి మాయమైన పలువురు అందాల భామలంతా.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వాళ్ల చేతిలో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు మెరిస్తే.. వాళ్లు మునుపటిలా మళ్లీ జోరు చూపించే అవకాశాలుంటాయి.
శ్రియ.. క్రేజీ క్రేజీగా..
తెలుగు తెరపై రెండు దశాబ్దాల సినీప్రయాణాన్ని పూర్తి చేసుకున్న కొద్ది మంది కథానాయికల్లో నటి శ్రియ (shriya saran) ఒకరు. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు చిత్రాలతో తీరిక లేకుండా గడిపిన ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత నుంచి కాస్త వేగం తగ్గించింది. అయినా అడపాదడపా ఏదో ఒక మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటోంది. 'ఎన్టీఆర్ బయోపిక్' తర్వాత రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన ఈ అందాల భామ.. మళ్లీ క్రేజీ ఆఫర్లతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'గమనం' అనే నాయికా ప్రాధాన్య సినిమా చేస్తోంది. సుజనా రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీంట్లో శ్రియ బధిర మహిళగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఆమె 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
నిత్యామేనన్ జోరు..
కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే నాయికల్లో అందరి కంటే ముందుంటుంది నటి నిత్యా మేనన్ (nitya menon). అందుకే తెలుగు తెరపై అడుగుపెట్టి పదకొండేళ్లు పూర్తవుతున్నా.. పాతిక చిత్రాలూ చేయలేకపోయింది. ఆమె నుంచి ఇటీవల వచ్చిన తెలుగు సినిమాలంటే.. 'గీత గోవిందం', 'ఎన్టీఆర్ బయోపిక్' మాత్రమే. అవి వచ్చీ రెండేళ్లు కావొస్తున్నాయి. అయితే ఇప్పుడీ అమ్మడి పేరు తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా కథానాయకులుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యామేనన్ నటించనున్నట్లు సమాచారం అందుతోంది. తెలుగులో స్కైల్యాబ్ కథాంశంతో తెరకెక్కుతోన్న కొత్త చిత్రంలోనూ.. 'గమనం'లోనూ ముఖ్య పాత్రలు పోషిస్తోంది.
అందాల అదా.. అదా
'హార్ట్‌ఎటాక్', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'క్షణం' లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముంబయి అందం అదా శర్మ (adah sharma). అటు ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు తెరపై మెరుస్తున్నది తక్కువే. ఆమె చివరగా తెలుగులో 'కల్కి' చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇప్పుడీ భామ 'క్వశ్చన్ మార్క్' (?) సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనుపమ అల్లరి..
మలయాళ సినిమా 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమై.. 'అఆ'తో తెలుగు వారి ముందుకొచ్చిన భామ అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran). 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగి', 'రాక్షసుడు' లాంటి చిత్రాలతో మంచి నాయికగా ఎదిగింది. రెండేళ్లుగా మలయాళ సీమకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో మళ్లీ వరుస సినిమాలతో జోరు చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె '18 పేజీస్' చిత్రంతో పాటు దిల్‌రాజు బ్యానర్‌లో ఓ కొత్త సినిమా చేస్తోంది.
'మజిలీ' భామ.. కొత్త అవకాశాలు
నాగచైతన్య హీరోగా నటించిన 'మజిలీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది అందం దివ్యాంశ కౌశిక్ (divyansha kaushik). ఆ చిత్రం తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. 'ది వైఫ్' అనే వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ, 'టక్కర్' చిత్రంతో తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ రెండూ ఆమెకి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ భామ మళ్లీ తెలుగు వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం. రవితేజ-దర్శకుడు శరత్ మండవ కలయికలో రూపొందనున్న కొత్త చిత్రంలోనూ ఆమె నాయికగా కనిపించే అవకాశముంది.