బాలీవుడ్.. దేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతోంది. ఇక్కడి సినిమాలతో పాటు హీరోహీరోయిన్లకూ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే కొందరు బాలీవుడ్ స్టార్స్‌ది మనదేశం కాదు. కొందరికి ఇక్కడి పౌరసత్వం కూడా లేదు. ఈ విషయం మనకు ఇప్పటివరకు తెలియకపోవచ్చు. ఇంతకీ భారత పౌరసత్వం లేని ఆ నటులు ఎవరు? వారు ఏ దేశానికి చెందిన వారు? వంటి విషయాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
కెనడా ఖిలాడీ.. అక్షయ్ కుమార్
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు భారత్‌లో వీరాభిమానులున్నారు. అయినా అతడికి భారతీయ పౌరసత్వం లేదంటే నమ్మగలరా? అక్కీ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టాడు. దిల్లీలో పెరిగాడు. 2011లో కెనడా ప్రభుత్వం అతడికి ఆ దేశ గౌరవ పౌరసత్వం ఇవ్వడం వల్ల ఇండియన్ సిటిజన్‌షిప్‌ని వదులుకున్నాడు. అతడి చర్యను చాలామంది వ్యతిరేకించారు. "బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉంటూ ఈ దేశ పౌరసత్వాన్ని ఎలా వదులుకుంటావు?" అని ప్రశ్నించారు. అప్పట్నుంచి అక్షయ్ మింగలేక, కక్కలేక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఏడాది కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాననీ వివరణ ఇచ్చినా ఇప్పటికీ అతడి దగ్గరుంది కెనడా పాస్‌పోర్టే.
బ్రిటీష్ అమ్మడు ఆలియా భట్
బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లలో ఆలియా భట్ ముందుంటుంది. ఆలియా దర్శకుడు మహేశ్ భట్ కూతురు. ముంబయిలోని పోష్ ఏరియా జుహూలో ఓ సొంతింటిదారు కూడా. అయినా తను బ్రిటీష్ పౌరురాలు. ఎందుకంటే ఆలియా తల్లి సోనీ రజ్దాన్ మూలాలు బ్రిటన్‌లోనే ఉన్నాయి. ఆ రకంగా వచ్చిన బ్రిటీష్ పౌరసత్వాన్ని ఎప్పుడూ వదులుకునే ప్రయత్నం చేయలేదు ఈ లేత భామ. భారతీయ సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు.
అమెరికా అబ్బాయి ఇమ్రాన్
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. పలు సినిమాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక్కడి అమ్మాయి అవంతికా మాలిక్‌ని పెళ్లాడాడు. ఏళ్లకొద్దీ ఇక్కడే ఉంటున్నా తను అమెరికన్ సిటిజన్. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో జన్మించాడు. తల్లిదండ్రులు విడిపోయాక, అమెరికా నుంచి తల్లితో కలిసి వచ్చి ముంబయిలో స్థిరపడ్డాడు. ఇమ్రాన్ భారత పౌరసత్వం కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం అక్కడి సిటిజన్‌షిప్ వదులుకోవాలంటే పదేళ్ల పన్నులు ముందుగానే చెల్లించాలి. ఆ భారాన్ని భరించలేక ఇంకా అమెరికా పాస్‌పోర్ట్‌తోనే వెళ్లదీస్తున్నాడు.
లండన్ భామ కత్రినా కైఫ్
కత్తిలాంటి కత్రినా లండన్ నుంచి నేరుగా బాలీవుడ్‌లో దిగిపోయింది. తను భారతీయ కశ్మీరీ మూలాలున్న తండ్రికి, బ్రిటీష్ లాయరైన సుజానే టర్కోట్‌కి హాంకాంగ్‌లో జన్మించింది. సుజానే లాయరే కాదు.. స్వచ్ఛంద కార్యకర్త. హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌లతోపాటు యూరోప్‌లోని చాలా దేశాల్లో పనిచేసి బ్రిటన్‌లో స్థిరపడింది. అక్కడే మోడలింగ్ మొదలుపెట్టింది కత్రినా. ఓ మోడలింగ్ షోకి హాజరైన దర్శకుడు కైజాద్ గుస్తాద్ బాలీవుడ్‌కి ఆహ్వానించాడు. అలా ముంబయిలో అడుగుపెట్టి, కొన్నాళ్లకే స్టార్ హోదా సంపాదించుకుంది. ముంబయిలో ఓ ఇల్లు కొనుక్కున్నా బిట్రీష్ పౌరసత్వాన్ని కొనసాగిస్తోంది.
శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నా.. ఇప్పటికీ ఆమెకు ఇండియన్ సిటిజన్‌షిప్ లేదు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల కిరీటం దక్కించుకున్న జాక్వెలిన్ ఎప్పటికైనా హాలీవుడ్ స్టార్ కావాలనుకుంది. మొదటి అడుగుగా హిందీ సినిమాల్లోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో ఇక్కడే సెటిలైంది. కెనడా, శ్రీలంక, మలేసియా మూలాలున్న ఫెర్నాండెజ్ ఇప్పటికీ శ్రీలంక పౌరురాలే.
కెనడా భామ సన్నీ లియోని
ఒకప్పటి శృంగార తార, బాలీవుడ్ హాట్ గర్ల్ సన్నీ లియోని భారతీయురాలు కాదనే సంగతి చాలామందికి తెలిసిందే. సన్నీ అసలు పేరు కరన్‌జిత్ కౌర్ వోహ్రా. కెనడాలో స్థిరపడ్డ పంజాబీ వ్యాపారవేత్త కూతురు. అక్కడే పోర్న్ ఇండస్ట్రీలో స్థిరపడి, ఆ రంగంలో ఉన్న అమెరికన్ డానియల్ వెబర్‌ని పెళ్లాడింది. బిగ్ బాస్ రియాలిటీ షోతో పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడికొచ్చి తొమ్మిదేళ్లు గడిచినా కెనడా పౌరసత్వమే కొనసాగిస్తోంది.
నర్గీస్ ఫక్రీ
'రాక్‌స్టార్' అనే రొమాంటిక్ డ్రామాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది నర్గీస్ ఫక్రీ. ఆ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత 'మద్రాస్ కేఫ్', 'హూస్ఫుల్ 3' వంటి చిత్రాల్లో నటించింది. ఆసక్తికర విషయం ఏంటంటే న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో పుట్టిన నర్గీస్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. ఈమె నాన్నది పాకిస్థాన్ కాగా, అమ్మది చెక్.
వీరు కూడా
- సారా జన్ డయాస్- ఒమన్
- బార్బరా మోరీ- మెక్సికన్, ఉరుగ్వేయిన్
- సప్నా పబ్బీ- బ్రిటీష్
- అలీ జాఫర్- పాకిస్థానీ
- ఎవ్లీన్ శర్మ- జర్మన్
- ఫవాద్ ఖాన్- పాకిస్థానీ