మనసుకు నచ్చిన పనిచేస్తే కలిగే ఆనందమే వేరు. ఇందుకు సెలబ్రిటీలూ అతీతులు కాదు. వారి బిజీ షెడ్యూల్‌లో ఏ కాస్త విరామం దొరికినా ఆసక్తులకూ అభిరుచులకూ కేటాయించుకుంటున్నారు. అవేంటో చూద్దామా!
ఒక్కటైనా ఉండాల్సిందే..
తరాలు మారుతున్నా.. క్రేజ్ తగ్గని నటుడు నాగార్జున. ఈ మన్మథుడికి పురాతన వస్తువుల్ని సేకరించడం అంటే ఎంతో ఆసక్తి. షూటింగ్‌లూ పర్యటనల కోసమని ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ప్రత్యేకతను చాటే వస్తువుని ఏదో ఒకటి కచ్చితంగా వెంట పెట్టుకుని తీసుకువస్తారట. ముఖ్యంగా పురాతన వస్తువుల్ని సేకరించడమంటే తనకెంతో ఆసక్తనీ ఇలాంటివి వేలల్లోనే తన దగ్గర ఉన్నాయనీ చెబుతారాయన. వీటితో పాటు ఈతన్నా నాగార్జున ఇష్టపడతారు.
వ్యర్థాలతో కానుకలు..
నటన, నిర్మాణ పనులతో బిజీగా గడిపేసే నటుల్లో రానా ఒకరు. కానీ ఏ కాస్త తీరిక చిక్కినా.. సృజనకు పని చెప్పడం తన అలవాటు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి కానుకలుగా మార్చడమంటే మరీ ఇష్టం. 'నాకో చిన్న వర్క్‌షాప్ ఉంది. ఇందులో-వృథాగా పడి ఉన్న గ్లాస్, చెక్క, ఫర్నిచర్ వంటి వాటితో ప్రయోగాలు చేసి కొత్తగా మారుస్తుంటా. వాటిల్లో కొన్నింటిని నా సన్నిహితులకు గిఫ్ట్‌లుగానూ అందించాను' అని రానా అన్నారు.
పెన్సిల్ ఆర్ట్ అదుర్స్..
తనదైన హాస్యంతో నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు బ్రహ్మానందం. నటనలోనే కాదు.. చిత్రకళలోనూ ఆయన దిట్టే. ఆ మధ్య మట్టితో వివిధ శిల్పాలకు ప్రాణం పోశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెన్సిల్ ఆర్ట్ పెయింటింగ్‌ల వంతు. అంతేకాదు, తాను స్వయంగా గీసిన దేవతా మూర్తుల చిత్రాలను సినీ ప్రముఖులకు కానుకలుగానూ అందించి ఆశ్చర్యపరుస్తున్నారు బ్రహ్మీ. ఆ మధ్య అల్లు అర్జున్, రానాలకు వీటిని ఇవ్వగా సాయిబాబా చిత్ర పటాన్ని సీనియర్ నటుడు కృష్ణంరాజుకు ఇచ్చారు. ఆత్మ సంతృప్తి కంటే మించింది మరేదీ లేదనే ఆయన పుస్తకాలు చదవడమన్నా తనకు ఎంతో ఇష్టమని చెబుతారు.
కొత్త భాషల్లోనూ..
సినిమాలైనా, రియాల్టీషోలైనా.. తనదైన శైలిలో రక్తికట్టించే కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. మనసుకు నచ్చిన పని ఏదైనా, ఎంత కష్టమైనా చేస్తా అనే ఆయనకు వంట చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ అద్భుతంగా చేస్తారు ఎన్టీఆర్. బిగ్‌బాస్ తొలి సీజన్‌లో ఆయన తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాక్‌డౌన్ కాలంలో అమ్మకూ శ్రీమతికీ సాయంగా గరిటె తిప్పుతున్నా అని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. అప్పుడు యూట్యూబ్‌లో చూసి రకరకాల స్నాక్స్ పిల్లలకోసం వండి పెట్టారట. ఇదే కాదు డ్యాన్స్ అన్నా కొత్త భాషలు నేర్చుకోవడమన్నా కూడా తనకు ఆసక్తే అంటారు ఎన్టీఆర్. ప్రత్యేకించి ఆర్‌ఆర్‌ఆర్‌లో తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం కోసం తమిళ, మలయాళ భాషలనూ నేర్చుకున్నారట.
క్లిక్ మనిపిస్తూ..
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ కాస్త తీరిక దొరికినా కొత్త విషయాలెన్నో తెలుసుకోవాలని తపన పడుతుంటారు. తన వృత్తిలో దూసుకుపోతూనే అభిరుచులకూ సమయం కేటాయిస్తుంటారు. అందులో గుర్రపు స్వారీ అంటే ప్రత్యేక అభిమానం చెర్రీకి. లాక్‌డౌన్‌లో గరిటె చేతబట్టి వంటలూ చేశారు. ఇటీవల కొత్తగా మరో హాబీని అలవాటు చేసుకున్నారు. ఫొటోగ్రఫీలో క్రాష్ కోర్సు చేశారు. ఆ మధ్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా వెళ్లడానికి ముందే.. ఫొటోగ్రఫీ టెక్నిక్స్ తెలుసుకున్నారట. ఆఫ్రికా అందాలను తన లెన్స్‌లో ఎంతో అద్భుతంగా బంధించారు.
ఇవీ చదవండి:
- Naatu Naatu song: తారక్- చెర్రీ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
- రాజమౌళి, కొరటాల శివకు ఎన్టీఆర్ వార్నింగ్!
- రానాకు అది వదులుకోలేని అలవాటు..!
- స్పోర్ట్స్ డ్రామాగా చరణ్-గౌతమ్ సినిమా!
- సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్
- మట్టితో బుజ్జి గణపతిని సృష్టించిన హాస్య బ్రహ్మ
- వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా: బ్రహ్మానందం
- బ్రహ్మానందం నుంచి బన్నీకి ఊహించని గిఫ్ట్