దేశంలో కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిస్తున్న దృష్ట్యా పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే సోమవారం(జూన్ 7) నుంచి మహారాష్ట్రలో సినిమా థియేటర్లు 50 శాతం సామర్ధ్యంతో తెరుచుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో సినిమా హాళ్లు, జులై తర్వాతే తెరవనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు టాలీవుడ్ నిర్మాతలు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. తమ సినిమా విడుదల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఆగస్టు నుంచి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్ధ్యంతో థియేటర్లు తెరిస్తే, దసరా కల్లా అంతా సాధారణ స్థితికి రావొచ్చు. దీంతో తమ చిత్రాల్ని ఆ పండక్కి తీసుకురావాలని భావిస్తున్నారు.
అందుకు తగ్గట్లుగానే చిరంజీవి 'ఆచార్య', ప్రభాస్ 'రాధేశ్యామ్', యష్ 'కేజీఎఫ్ 2' సినిమాలు దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి కంటే ముందు 'లవ్‌స్టోరి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'టక్ జగదీష్' తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
'ఆర్ఆర్ఆర్' విడుదల అక్టోబరు 13 అనే చిత్రబృందం చెబుతున్నప్పటికీ, ఆ తేదీ మారే అవకాశమే దాదాపుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప' తొలి పార్ట్.. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: