బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ శవపరీక్షను పరీక్షించిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం ఇది హత్య కాదని ఆత్మహత్య చేసుకోవడం వల్లే హీరో మరణించాడని వెల్లడించింది. అయితే ఈ విషయంపై సుధీర్ గుప్తా నుంచి వివరణ కావాలని సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి డిమాండ్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా తాను అడిగిన ప్రశ్నకు సుధీర్‌గుప్తా సమాధానమివ్వాలని స్పష్టం చేశారు శ్వేతా. "ఇలాంటి యూ-టర్న్ తీసుకోవడానికి కారణాలను తప్పక వివరించాలి" అంటూ పోస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే?
సుశాంత్ మృతి వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే హీరో శవపరీక్షలో అనుమానాల కారణంగా నిజాలు తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్ధ అభ్యర్ధన మేరకు ఆగస్టులో ఎయిమ్స్ ఫోరెన్సిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందానికి అధ్యక్షత వహించిన డాక్టర్ సుధీర్ గుప్తా.. సుశాంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసిన కూపర్ ఆస్పత్రి నివేదికపై ఆరా తీశారు.
అన్ని వివరాలను తెలుసుకున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని.. అతనిపై ఎలాంటి విషప్రయోగం గానీ, హత్యా ప్రయత్నం గానీ జరగలేదని డాక్టర్ సుధీర్ గుప్తా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.