"నేనెప్పుడూ పూర్తి కథ వినడానికే ఇష్టపడతా. కథ విన్న అరగంటలోనే అది నాకు సరిపోతుందో లేదో.. ఓ నిర్ణయానికి వచ్చేస్తా. ప్రేమకథలైనా.. థ్రిల్లర్లయినా.. నాకు సరిపోతుంది అనిపించిన కథల్ని నేనెప్పుడూ వదులుకోలేదు" అని అన్నారు సుమంత్. ఒకప్పుడు ప్రేమకథలతో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు థ్రిల్లర్ కథలకు చిరునామాగా మారారు. ఈ క్రమంలోనే 'కపటధారి'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. నందిత శ్వేత కథానాయిక. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

*థ్రిల్లర్ కథలే చేయాలని నేనేమీ ప్రణాళిక వేసుకోలేదు. నిజానికి 'మళ్లీరావా' తర్వాత ప్రేమకథలే వస్తాయనుకున్నా. ఎందుకో థ్రిల్లర్లే ఎక్కువ వచ్చాయి. మధ్యలో కొన్ని రొమాంటిక్ కథలొచ్చినా.. అవి అంతగా నచ్చలేదు. నేనిప్పటి వరకు చేసిన థ్రిల్లర్ చిత్రాల్లో 'కపటధారి' ప్రత్యేకమైనది. కన్నడలో విజయవంతమైన 'కవలుధారి'కి రీమేక్‌గా రూపొందింది. ఓ ట్రాఫిక్ ఎస్సై జీవిత కథ ఇది. ఎప్పుడో మూతపడిన 40ఏళ్ల క్రితం నాటి ఓ హత్య కేసు చుట్టూ తిరుగుతుంటుంది. పై అధికారులు వద్దని వారిస్తున్నా.. ఆ హత్య కేసును ఓ ట్రాఫిక్ ఎస్సై తనదైన శైలిలో ఎలా పరిష్కరించాడు? అన్నది ఈ చిత్ర కథాంశం.
* దర్శకుడు నాకీ కథ చెప్పినప్పుడే మాతృక చూశా. కొన్ని సన్నివేశాలు చూసి ఆశ్చర్యపోయా. వాటి వల్లే ఈ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నా. మాతృకతో పోల్చితే తెలుగులో స్క్రీన్‌ప్లే చాలా షార్ప్‌గా అనిపిస్తుంది. ఇది విశ్వజనీనమైన కథ కాబట్టి నేటివిటీ సమస్య కనిపించదు. సినిమాలోని క్రైమ్ డ్రామా, మలుపులు, సస్పెన్స్.. అన్నీ ప్రేక్షకుల్ని సీట్లకు కట్టిపడేస్తాయి.
* ప్రస్తుతం 'అనగనగా ఒక రౌడీ' సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాక ఒక కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">