నటుడు నాగబాబు ముద్దుల కుమార్తెగా మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. వ్యాఖ్యాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఒక మనుసు' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె వెబ్‌సిరీస్‌ల్లోనూ సందడి చేశారు. ఇటీవల చైతన్యతో ఏడడుగులు వేసిన నిహారిక పుట్టినరోజు ఈరోజే. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి నిహారిక పలు సందర్భాల్లో ఈ విధంగా చెప్పారు..
కేఫ్‌లో పనిచేశా..
చదువు పూర్తైన తర్వాత హైదరాబాద్‌లోని ఫిల్మ్‌క్లబ్‌లోని కాఫీ క్లబ్‌లో పనిచేశా. విభిన్నమైన మనుషులను కలవాలని.. సంస్కృతుల గురించి తెలుసుకోవాలని నాకు మొదటి నుంచి ఆసక్తిగా ఉండేది. అలాంటి సమయంలో ఓరోజు కాఫీడేలో పనిచేస్తానని నాన్నతో చెప్పా. ఆయన ఓకే అన్నారు. అలా కాఫీ క్లబ్‌లో పనిలో చేరా. అక్కడ వారానికి రూ.1000 ఇచ్చేవాళ్లు. అదే నా తొలి సంపాదన.
అనుకోకుండా వచ్చిన అవకాశం..
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమైనప్పటికీ నటిని కావాలని ఏరోజు అనుకోలేదు. అనుకోకుండా ఓసారి లఘుచిత్రంలో నటించే అవకాశం లభించింది. వేరే అమ్మాయి నటించకపోతే ఆమె స్థానంలో చివరికి నేను ఆ పాత్ర చేయాల్సి వచ్చింది. అందులో నా నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి గారు 'ఢీ' జూనియర్స్‌లో వ్యాఖ్యాతగా అవకాశమిచ్చారు. కెమెరా ముందుకు వచ్చిన కొత్తలో ఎంతో భయమేసింది. నాన్న ప్రోత్సహించారు. శ్యామ్‌గారు కూడా ధైర్యం చెప్పారు.
జోక్ అనుకున్నారు..
పెదనాన్న అడుగు జాడల్లో మెగా కుటుంబం నుంచి యువ హీరోలు వచ్చి ఇండస్ట్రీలో తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. అయితే, మా కుటుంబం నుంచి నేను కాకుండా సినీ రంగంలోకి ఏ అమ్మాయి రాలేదు. నాకు సినిమాలంటే ఆసక్తి ఉందని మా కుటుంబంలో తెలుసు. కానీ, ఓ రోజు సడెన్‌గా.. 'సినిమాల్లోకి వెళ్దామనుకుంటున్నా' అని చెప్పా. ఆ మాట విని అందరూ షాక్ అయ్యారు. 'జోక్ చేస్తున్నావా' అని నాన్న అడిగారు. నా ఇష్టానికి ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పలేదు.
'అంజి'లో నటించా..!
చిన్నప్పుడు చిరంజీవి పెద్దనాన్న, కల్యాణ్ బాబాయ్ సినిమా షూటింగ్స్‌కు వెళ్తుండేదాన్ని. ఆ షూటింగ్ అనుభవాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. పెద్దనాన్న నటించిన 'అంజి' సినిమాలో నేను ఓ పాత్ర చేశా. అప్పుడు నా వయసు నాలుగేళ్లు. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేశారు. కథకు అనుగుణంగా కొంచెం పెద్ద వయసు పిల్లలు అయితే బాగుందని చిత్రబృందం భావించింది. అలా నేను చేసిన సన్నివేశాలను తొలగించేశారు. పెదనాన్నతో చేసిన ఆ సినిమా షూటింగ్ ఎప్పటికీ మర్చిపోలేను.
చెర్రీ అన్నని బతిమాలి..
పెద్దనాన్న సినిమాలో నటించాలన్నది నా కోరిక. అది 'సైరా' చిత్రంతో తీరింది. అందులో నాది చాలా చిన్నపాత్రే అయినప్పటికీ నాకు సంతోషంగానే అనిపించింది. చరణ్ అన్నను బతిమాలి.. 'సైరా'లో పాత్ర సంపాదించా. 'ఖైదీ నంబర్ 150' సమయంలోనే కారెక్టర్ గురించి చరణ్ అన్నని అడిగాను. కానీ అప్పుడు కుదరలేదు. కానీ 'సైరా'లో మాత్రం అవకాశం దక్కింది.
అన్నని మిస్ అయ్యా..
వరుణ్ అన్న వయసులో నాకంటే నాలుగేళ్లు పెద్ద. ఇంట్లో మేమిద్దరం బాగా అల్లరి చేసేవాళ్లం. నాకు స్నేహితులు చాలా తక్కువ. అన్నయ్య స్నేహితులే నాకూ స్నేహితులు. నాకు దెయ్యమంటే ఎంతో భయం. రాత్రిపూట అందరూ నిద్రపోయిన సమయంలో కింద రూమ్‌లోకి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకురా అని వరుణ్ చెబుతుండేవాడు. నేను వెళ్లగానే గట్టిగట్టిగా శబ్దాలు చేసేవాడు. నాకు చాలా భయం వేసేది. ఆ సమయంలో నన్ను చూసి అన్నయ్య బాగా నవ్వుకునేవాడు. 'ముకుందా'కు ముందు నటనలో శిక్షణ తీసుకునేందుకు అన్నయ్య కొంతకాలం వైజాగ్‌లో ఉన్నాడు. అప్పుడు అన్నయ్యని బాగా మిస్ అయ్యాను. ఇంట్లో వెలితిగా ఉండేది.
కల్యాణ్ బాబాయ్ ఆటపట్టించేవాడు..
చిన్నప్పుడు కల్యాణ్ బాబాయ్ నన్ను బాగా ఆటపట్టించేవాడు. చిన్నతనంలో నా కళ్లు కొంచెం చిన్నగా ఉండేవి. దాంతో బాబాయ్.. నన్ను జపాన్ పిల్లా అంటూ ఏడిపించేవాడు. మా కుటుంబంలో నన్ను ఎక్కువగా పొగిడేది బన్నీనే. వరుణ్- చెర్రీ అన్న కూడా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు.
అలా పిలిస్తే చాలా భయం..
నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది నన్ను 'మెగా ప్రిన్సెస్' అని పిలవడం ప్రారంభించారు. అది వినడానికి గొప్పగా ఉంటుంది. కానీ నాకు మాత్రం ఎంతో భయంగా అనేపించేది. నటిగానే కొనసాగాలనే ఉద్దేశం నాకు లేదు. మంచి కథ, పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్పకుండా నటిస్తా. గ్లామర్ పాత్రలు చేయడానికి నాకు ఆసక్తి లేదు.