మహేశ్‌బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్‌ను... తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సూపర్‌స్టార్.. మేజర్ అజయ్ కృష్ణగా నటించాడు. ప్రిన్స్ సరసన రష్మిక మందన్న కథానాయికగా ఆకట్టుకోనుంది. లేడీ అమితాబ్ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది.
" మీరెవరో మాకు తెలియదు... మీకూ మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ మీ కోసం, మీ పిల్లల కోసం పగలు-రాత్రి, ఎండా-వానా అనే తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత" అని అజయ్ కృష్ణగా మహేశ్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది.
"భయపడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా"అని ప్రిన్స్... "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్" అని విజయశాంతి..."ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు... ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్‌రాజ్ చెప్పిన డైలాగ్స్‌తో టీజర్ ఆసక్తికరంగా రూపొందించారు. ఈ నిముషంన్నర వీడియో చూశాక చిత్రంపై మరింత అంచనాలు పెరిగే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలోని అంగామలై అటవీ ప్రాంతంలో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అనంతరం నవంబర్ 25 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షూటింగ్ జరగనుంది. దిల్‌రాజు, రామబ్రహ్మం, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చాడు.
విడుదల తేదీ మార్పు...
సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే అదే రోజు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో..' విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం వల్ల బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంటుందని.... ఇందువల్ల ఇరు చిత్రాల నిర్మాతలకు నష్టం కలుగుతుందని తెలుగు చిత్ర నిర్మాతల సంఘంలో ఈ విషయంపై చర్చించారు. ఫలితంగా రెండు సినిమా నిర్మాతలు అనిల్ సుంకర, చినబాబు తేదీల మార్పునకు అంగీకరించారు. 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, 'అల.. వైకుంఠపురములో..' జనవరి 12న విడుదల కానున్నట్లు ప్రకటించారు.