కరోనా(కొవిడ్-19) దెబ్బకు ప్రపంచదేశాలతో పాటు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. అందులో సినీ రంగం ఒకటి. కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలు, చిత్రీకరణలు, వాటికి సంబంధించిన వేడుకలు వాయిదా పడుతున్నాయి. ప్రముఖ హీరోలంతా తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు.
అయితే ఈ మహమ్మారికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం భయపడనంటున్నాడు. ప్రస్తుతం అతడు 'రాధే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌నూ యథావిధిగా కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా దిశా పటానీ నటిస్తోంది. తాను కూడా చిత్రీకరణలో చురుగ్గా పాల్గొంటోంది. కరోనా సోకకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన జాగ్రత్తలను చిత్రబృందం పాటిస్తుండటమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తిచేయడమే లక్ష్యంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాను దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు. ఈద్ కానుకగా మే 22న థియేటర్లలోకి రానుంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో 'వాంటెడ్', 'దబంగ్ 3' చిత్రాలు వచ్చాయి. సల్మాన్, సొహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి : బాక్సాఫీస్‌పై వేసవిలో అక్షయ్, సల్మాన్ దండయాత్ర