యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజమ్ అంశం చర్చనీయాంశమైంది. ఇదే విషయమై మాట్లాడిన నటి రిచా చద్దా.. దీనితోపాటు పలు విషయాలపై తన బ్లాగ్ వేదికగా గళం విప్పింది. ఇండస్ట్రీలోని పలువురు దర్శకులు.. నటీమణులను చులకన భావంతో చూస్తారని, వాళ్ల గదికి వెళ్లకపోతే చివరి నిమిషంలో సినిమా నుంచి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయని పేర్కొంది.
బాలీవుడ్లో ఇన్సైడర్స్(వారసులు)-అవుట్‌సైడర్స్(ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వచ్చినవారు) అని రెండు వర్గాలు ఉన్నాయని చెప్పిన రిచా.. ఇందులోనూ మంచి, చెడ్డ వ్యక్తులు ఉన్నారని స్పష్టం చేసింది.
తాను స్టార్ కిడ్స్‌కు వ్యతిరేకం కాదని తెలిపిన రిచా.. ఇండస్ట్రీలో తాను స్వశక్తితో ఎదిగిన వ్యక్తినని వెల్లడించింది. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి స్నేహితులపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుండటం బాధ కలిగించిందని చెప్పింది.
సుశాంత్ స్నేహితులు, అతడి ప్రేయసి సోషల్ మీడియా ఖాతాలు కామెంట్లు అనే చెత్తతో ప్రస్తుతం పేరుకుపోయాయని రిచా చెప్పింది. అసలు ఈ అభిమానులు ఎవరు? వీరిలో కొందరు ఫ్రొపైల్స్ పరిశీలించానని, 'పద్మావత్' వివాదంలో చిత్రబృందం వైపు నిల్చున్న సుశాంత్‌ను నిందించింది వీళ్లేనని పేర్కొంది. అప్పుడు అలా చేసిన ఈ 'ఫ్యాన్స్'.. ఇప్పుడు అతడి సన్నిహితులపైనా విమర్శలు చేస్తున్నారని వెల్లడించింది.
బాలీవుడ్‌లోను పలువురు దర్శకులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది రిచా. సుశాంత్ మరణం తర్వాత సంతాపం తెలిపిన ఆ డైరెక్టర్లు.. తన గదికి రాలేదని చివరి నిమిషంలో హీరోయిన్ను మార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పింది.