యువ కథానాయకుడు రామ్ నాయిక మాళవిక శర్మతో కలిసి పది వేల అడుగుల ఎత్తులో ప్రేమ గీతం ఆలపించాడు. ఈ ఇద్దరితో కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం 'రెడ్'. స్రవంతి రవికిశోర్ నిర్మాత. ఇటలీలోని డోలోమైట్స్ పర్వత ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.
ఇక్కడ ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు తెరకెక్కిస్తారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిన తొలి తెలుగు చిత్రంగా 'రెడ్' నిలిచింది. మరో పాటను ఈ నెలాఖరున హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ సరసన మరో నాయిక నివేదా పేతురాజ్ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్- కిశోర్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం కావడం వల్ల అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.