మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత మలయాళ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది.
ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుందని టాక్. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరపగా.. సుముఖత చూపారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
గతంలో 'అల్లుడు మజాకా' సినిమా సహా పలు చిత్రాల్లో కలిసి నటించారు చిరు-రమ్యకృష్ణ. అప్పట్లో ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.