పూర్వాశ్రమంలో.. అంటే 1969 ప్రాంతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ బెంగుళూరు శ్రీనగర్-మెజేస్టిక్ రూట్ సిటీ బస్సులో కండక్టర్. ఆ బస్ రూటుకు డ్రైవర్ రాజబహదూర్. ఇద్దరి మధ్య స్నేహబంధం రెక్కలు తొడిగింది. రాజబహదూర్ ప్రోత్సాహంతో రజనీ బి.టి.ఎస్ (బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) నాటకరంగ కళాకారుల బృందంలో చేరి పౌరాణిక నాటకాల్లో కర్ణుడు, దుర్యోధనుడు వంటి మంచి పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నారు. రజనీ నటనలో ఉన్న ప్రత్యేక శైలిని చూసి రాజబహదూర్ సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికి ఇష్టపడని రజనీని రాజబహదూర్ ఒప్పించారు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తనకున్న పాల డెయిరీలో పనిచేయవచ్చని ధైర్యం నూరిపోశారు.
అలా రజనీ యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. నెలకు రెండు వందలు రాజబహదూర్.. రజనీకి మనీ ఆర్డర్ చేసేవారు. ఎప్పుడైనా డబ్బులు పంపలేకపోతే ఉపయోగపడేందుకు తన బంగారు గొలుసు రజనీ చేతిలో పెట్టారు. రజనీ దశ తిరిగి బాలచందర్ చేతిలో పడ్డారు. అపూర్వ రాగంగళ్, మూన్రాం ముడిచ్చు వంటి ప్రయోగాత్మక సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నారు.
ఎంత ఎదిగినా తనను ప్రోత్సహించి, డబ్బు పంపి ఆదుకున్న రాజబహదూర్‌ని మాత్రం మరవలేదు రజనీ. తరచూ బెంగుళూరు వెళతారు. రాజబహదూర్‌తో కలిసి విద్యార్థి భవన్‌లో నేతి దోశలు కట్టించుకొని ఎంచక్కా కృష్ణారావు పార్కులో కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇద్దరూ ఎం.జి.రోడ్డు, బ్రిగేడ్ రోడ్లవెంట పబ్లిక్‌గా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని కబుర్లాడుకుంటూ, జోకులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే అంతపెద్ద సూపర్ స్టార్ అంత పబ్లిక్‌గా తిరగడం ఎలా సాధ్యం అనే ప్రశ్న మనకు తలపించక మానదు.
సాధ్యం చేసి చూపాడు
అయితే సూపర్ స్టార్ అయి పబ్లిక్‌గా తిరగడం రజనీ సాధ్యం చేసి చూపారు. బెంగుళూరు నడిబొడ్డున రజనీకి ఫ్లాట్ వుంది. ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరవై యేళ్ళ వృద్ధుడులాగానో లేక ఎనభై యేళ్ళ వృద్ధుడిలాగానో తన వేషం మార్చుకుంటారు. తరువాత రాజబహదూర్ వచ్చి కలుస్తారు. ఇద్దరూ కలిసి రజనీ మొదట్లో ఉన్న అద్దె ఇంటివైపు వెళ్తారు. గుట్టళ్లి ప్రాంతంలో ఒక బజ్జీకొట్టులో వేడివేడి బజ్జీలు, బోండాలు కొంటారు. వాటిని పార్సిల్ కట్టించుకొని ఉమా థియేటర్ దగ్గరలో ఉన్న మెట్లమీద కూర్చుంటారు. వచ్చేపోయే వారిని చూస్తూ వాటిని ఆరగిస్తారు. తరువాత ఆ పక్కనే ఉండే టీ పాకలో స్ట్రాంగ్ కాఫీ తాగుతారు. మళ్లీ నడక సాగించి బళేపేట రామన్న హోటల్‌లో బిర్యానీ పొట్లం కట్టించుకుని గంగాధర పార్కులో కూర్చొని దాన్ని లాగిస్తారు.
కొంగుకు చాటున సాయం
ఒకసారి అలా రజనీ-రాజబహదూర్ వెళుతూ వుంటే ఒక వృద్ధురాలు కట్టెలమోపు నెత్తికి ఎత్తుకోలేక అవస్థ పడుతూ వుండడం రజనీ గమనించారు. వెంటనే వెళ్లి ఆ మోపును ఆ వృద్ధురాలి నెత్తిమీదకు చేర్చారు. ఆమె వెంట కొంచెం దూరం నడిచి ఎవరూ గమనించడం లేదని రూఢి పరచుకున్న తరువాత జేబులోనుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి ఆమె చీర కొంగుకు కట్టారు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఇంటికి వెళ్లిన తరువాత కొంగుముడి విప్పమని చెప్పి రాజబహదూర్‌తో అదృశ్యమయ్యారు. ఆ కొంగుముడిలో రజనీ వదలిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. అది అంత పెద్ద మొత్తం! అలా ఒకరికి కాదు తోపుడు బండిని తోయలేక అవస్థపడుతున్న వృద్ధుడికి, చిత్తు కాగితాలు ఏరుకునే నిరుద్యోగికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి అలా డబ్బు ఇచ్చి సాయం చేసేవారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి రాజకీయ అరంగేట్రంపై సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!