Rajamouli Special Interview: రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తెరకెక్కించే సినిమాలు.. అందులోని ప్రతి సన్నివేశం ఓ అద్భుతం. ఆయన చిత్రాల్లోని ప్రతి ఫ్రేమూ ప్రేక్షకులను ఊహాలోకంలో విహరింపచేస్తుంది. అయితే.. జక్కన్న సినిమా తీసే క్రమంలో ఎలా ఆలోచిస్తారు? ఇతరుల సలహాలు తీసుకుంటారా? లేదా? అనే పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులను గతంలో ఈటీవీ యువభారత్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ససేమిరా..
"నా సినిమా విజయవంతమవ్వడానికి కారణం నా రేషనాలిటీ. కథలో ఓ సన్నివేశం లేదా పాయింట్ గొప్పగా అనిపిస్తుంది. దాన్ని సెంట్రల్ ఐడియా అంటాం. కథను డెవలెప్ లేదా మేకింగ్ చేసేటప్పుడు ఓ సన్నివేశం తెరకెక్కించే విషయంలో నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటా. ఎవరైనా వచ్చి ఆ సన్నివేశం మార్చాలని సలహా ఇస్తే అస్సలు ఒప్పుకోను. 'ఆ సీన్ ఎవరూ చూడరు?', 'వర్కౌట్ అవ్వదు' అని అంటుంటారు. కానీ అవి పట్టించుకోను. ఒకవేళ ఏదైనా తేడాగా ఉందని నాకు అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇతరుల సూచనలు తీసుకుంటా" అని తెలిపారు జక్కన్న.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రోల్‌మోడల్స్ ఎవరైనా ఉన్నారా?
"ప్రతి మనిషిలో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. అందుకే నాకు రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరు" అని చెప్పారు రాజమౌళి.
ఆ కళలో ప్రావీణ్యం..
దర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే ఏదో కొత్తదనం మనముందుకు వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఓ కథను చూపించే ప్రయత్నం ఎంతో భిన్నంగా, ఆసక్తిగా ఉంటుంది. కానీ తనలో చిన్ననాటి నుంచే ఓ కథను ఆసక్తికరంగా చెప్పే కళ ఉందని వెల్లడించారు రాజమౌళి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"మా అమ్మమ్మ దగ్గర చాలా తెలుగు పుస్తకాలు.. పంచతంత్రం, బాలరామాయణం, బాలభారతం ఇలా పిల్లలకు సంబంధించిన ఎన్నో కథల పుస్తకాలు ఉండేవి. నేను చాలా పుస్తకాలు చదివేవాడిని. మా పాఠశాలలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరిగేవి. సాధారణంగా ఈ క్లాస్‌లో డ్యాన్సింగ్, సింగింగ్ ఇంకేదైనా పిల్లల కోసం ఉంటాయి. కానీ నేను రెండు, మూడు, నాలుగో తరగతులు చదివేటప్పుడు మా స్కూల్లో శనివారం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే రాజమౌళి స్టోరీ టెల్లింగ్. హ్యాండ్ రైటింగ్ క్లాస్ అయిపోగానే అందరూ నావైపు చూస్తారు. నేను వెళ్లి నిల్చొని నేను చదివిన కథలను చెప్పేవాడిని. ఆ కథలో నాకు ఏదైనా నచ్చకపోతే అందులో మార్పులు చేసి నాకు నచ్చిన విధంగా చెప్పేవాడిని."
-రాజమౌళి, దర్శకుడు.
15 ఏళ్ల క్రితమే ఆ సీన్..
ఇప్పటివరకు రాజమౌళి 11 సినిమాలు తీస్తే.. అన్నీ విజయవంతం అయ్యాయి. దీన్ని బట్టే ఆయన స్టామినా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే సినిమాలతో రాజమౌళి హిట్లు, బ్లాక్బస్టర్లు కొట్టే విషయంలో కథారచయిత, తన తండ్రి విజయేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకం. ఆయన అద్భుతంగా స్టోరీ రాస్తే, దానిని అంతకంటే అద్భుతంగా తెరకెక్కించి, ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేసేవారు రాజమౌళి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీరి కాంబినేషన్లో వచ్చిన రామ్‌చరణ్- 'మగధీర' అయితే అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. అందులో 100 మందిని చంపే సీన్ ఇప్పుడు చూసినా సరే రోమాలు నిక్కబొడుచుకోవడం(గూస్బంప్స్) ఖాయం.
మగధీరలో కాలభైరవ(రామ్‌చరణ్) 100 మందిని చంపే సీన్ అల్టిమేట్. అప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్‌గా నిలిచింది. అయితే అంతకు 15 ఏళ్ల క్రితమే తన తండ్రి ఈ సీన్‌ను రాశారని రాజమౌళి 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దానిని పట్టుకొని ఓ డైరెక్టర్ దగ్గరకు వెళ్తే ఇలాంటివి ఎవరు చూస్తారంటూ మాట్లాడారని అన్నారు. తానే దర్శకుడిగా మారిన కొన్నాళ్లకు ఆ కథను 'మగధీర'గా తెరకెక్కించినట్లు చెప్పారు.
ఆర్ఆర్ఆర్..
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
ఇదీ చదవండి: చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు.. చరణ్‌కు తెలియదు: రాజమౌళి