"వ్యవసాయం దండగ కాదు.. పండగ అనే రోజు రావాలని, అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నేను తీసిన చిత్రమే 'రైతన్న" అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్రధారిగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం సెన్సార్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ "నేటి మన దేశంలో రైతు కుటుంబంతో పెళ్లి సంబంధం అంటేనే ఎవరూ ముందుకు రాని పరిస్థితి. సామాజికంగా వెనకబడి కులం ఏదైనా ఉందంటే అది రైతు కుటుంబమే. అప్పులు తీర్చుకోలేక, బిడ్డల పెళ్లిళ్లు చేయలేక, పిల్లల్ని చదివించలేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు కర్షకుడు. రైతుకి గిట్టుబాటు ధర రావాలని పుడమి పుత్రుని గొంతుకతో మేం సినిమాలో చెబుతున్నాం" అన్నారు.