ఎన్నో ఇంటర్వ్యూల్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని బాహాటంగానే చెప్పారు 'బాహుబలి' కథా రచయిత విజయేంద్రప్రసాద్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పవన్‌తో సినిమా గురించి పరోక్షంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్.. పవన్ కోసం ఓ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఆ కథను విజయేంద్రప్రసాద్.. పవన్‌కల్యాణ్‌కు వినిపించారట. స్క్రిప్ట్ విన్న పవన్.. సినిమాలో నటించేందుకు సుముఖంగా ఉన్నారట. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. సాధారణంగా విజయేంద్రప్రసాద్ రాసే కథలకు ఆయన కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తారు. కానీ, రాజమౌళి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ కథను దర్శకత్వం వహించేందుకు సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఈ కథను మరొక దర్శకుడు పట్టాలెక్కిస్తాడా? లేదా రచయిత విజయేంద్రప్రసాద్ మరోసారి మెగాఫోన్ చేతపడతారా? అనేది తెలియాల్సి ఉంది.
మెగాఫోన్ పడతారా?
విజయేంద్రప్రసాద్.. తెలుగులో 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో పాటు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నింటికి కథ అందించారు. బాలీవుడ్లో 'బజరంగీ భాయ్‌జాన్', 'తలైవి' వంటి కథలను రచించారు. అయితే కథకుడిగా ఆయన సినిమాలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. కానీ, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజన్న' ఫర్వాలేదనిపించినా.. 'శ్రీవల్లీ' సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
వరుస చిత్రాలతో..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' షూటింగ్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాల్లో పవన్ నటించాల్సిఉంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత విజయేంద్రప్రసాద్ కథ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి.. 'ఎఫ్ 3' షూటింగ్ రీ-స్టార్ట్.. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' థీమ్