కథానాయిక పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైంది. అంతేకాదు ఆమె ఖాతా నుంచి నటి సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పూజ తన టెక్నికల్ టీమ్ సాయంతో ఇన్‌స్టా ఖాతాను పునరుద్ధరించుకున్నారు. అయితే, ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమంత గురించి పూజా ఇన్‌స్టాలో హ్యాకర్ పెట్టిన అభ్యంతర వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వాటిని చూసిన సమంత అభిమానులు ట్విట్టర్ వేదికగా "పూజాహెగ్డే క్షమాపణ చెప్పాలి" అంటూ ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు.
ఇన్‌స్టా ఖాతా పునరుద్ధరించిన తర్వాత సమంతపై వచ్చిన అభ్యంతరకర వ్యాఖ్యలని తొలగించిన పూజ.. ఖాతాను బాగు చేసిన తన సిబ్బందికి ధన్యవాదాలు కూడా తెలిపారు. "హ్యాక్‌కు గురైన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పునరుద్ధరించడం కోసం గంటపాటు శ్రమించాం. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన నా టెక్నికల్ టీంకు ధన్యవాదాలు. చివరికి నా అకౌంట్ నా చేతుల్లోకి వచ్చింది. గంట క్రితం నా అకౌంట్ నుంచి వచ్చిన పోస్టులను, మెస్సేజ్‌లను తొలగించాం" అని పూజ వివరణ ఇచ్చినా కూడా సమంత ఫ్యాన్స్ ఆగలేదు. దీంతో సమంత శాంతి చిహ్నాన్ని చూపిస్తూ, చిరు నవ్వుల ఫొటోను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో గాయని, సమంతకు స్నేహితురాలు, డబ్బింగ్ ఆర్టిస్ అయిన చిన్మయి శ్రీపాద #టీమ్‌సమంత పేరుతో పలు ట్వీట్లు చేశారు.
"దీన్ని ఇక్కడితో వదిలేయండి. రెండు రోజుల క్రితం సమంత ఇన్‌స్టా ఫాలోవర్లు 10మిలియన్లు చేరిన సందర్భంగా 10 ఎన్జీవోలకు ఆమె సాయం చేశారు. వాటిలో అక్షయ్ ట్రస్ట్ ఒకటి. ఎలాంటి రుసుము తీసుకోకుండా వృద్ధులకు అది ఆశ్రయం కల్పిస్తుంది. సోషల్ మీడియా గురించి గతంలో నేను చాలా సార్లు చెప్పా. దయచేసి ఇలాంటివి నమ్మకండి. సమంత మంచి మనిషి. దీని వెనుక ఉన్న వాళ్లు ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవ గురించి కూడా తెలుసుకోవాలి.. ముగిసింది" అని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి : నెట్టింట వైరల్‌గా సూర్య 'బందోబస్త్' వీడియోలు