పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ చేయబోయే ఓ కార్యక్రమం గురించి మాట్లడారు.
"జూ.ఎన్టీఆర్‌తో బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు' ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడాను. ఆ తర్వాత కలవలేదు. మనం ప్రేమించే వ్యక్తిని వెండితెర మీద కలుసుకోవడం ఒక ఆనందం. వ్యక్తిగతంగా కలుసుకోవడం మరొక ఆనందం. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారు. ఆయన ఎక్కడుంటారో మనకు తెలియదు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే అంత గొప్పగా ఉంటుంది. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ తర్వాత మరో సినిమా రాలేదు. ఈ మధ్య ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘నన్ను ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాను’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ని నేను ‘తారక్’ అని పిలిస్తే.. చాలా మంది ‘మీరు అలా పిలవకండి చిన్నరామయ్య’ అని పిలవండని మెస్సేజ్‌లు పెడుతుంటారు. మీ అందరి కోసం నేను చిన్నరామయ్యే అని పిలుస్తా. నేను అతనిలో అన్నగారిని చూసుకుంటాను. అతని గురించి ఏ ఆలోచనలు వచ్చినా అన్నగారే గుర్తుకొస్తుంటారు"
"తాజాగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రచార చిత్రంలో ఎన్టీఆర్ కనిపించారు. పెద్ద హీరోలు అలా నటిస్తుంటే ‘వీరికి ఇది అవసరమా’ అనిపిస్తుంది. అయితే ఎక్కడికో వెళ్లిపోయాడనుకున్న అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తో మళ్లీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. అన్నగారిలానే జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి రెండూ చిన్నరామయ్యకు ఉన్నాయి. మనం ఏం చెప్తున్నామనే అనేది ఎదుటివారికి ముఖంలో తెలుస్తుంది. అది తప్పా? ఒప్పా? అనేది బయటికి తెలియకుండా చేయగల సత్తా చిన్నరామయ్యకు ఉంది. మన తెలుగు భాష ఎంతో గొప్పది. అలాంటి భాషకు మళ్లీ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లాంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ తెలుగు ఔన్నత్యాన్ని మరింతగా చాటిచెప్తారని భావిస్తున్నా. మేం ఎక్కడున్నా మీ పోగ్రాం కోసం ఎదురుచూస్తుంటామని" అని పరుచూరి చెప్పుకొచ్చారు.