ఇటీవల కాలంలో మన దేశంలో ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే కొన్ని సినిమాలు నేరుగా దీంట్లోనే విడుదలవుతున్నాయి. ఇదే అవకాశంగా అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ కూడా భారతీయులకు బాగా చేరువైపోయింది. మిగతా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కొన్ని ఉచిత షోలు, సినిమాలు అందుబాటులో ఉంటాయి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఉండవు. అందులో ఏం చూడాలన్నా ముందుగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. కానీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ కూడా కొన్ని షోలు, సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. అయితే వాటిని కేవలం కంప్యూటర్/ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లోనే చూసే వీలుంది. నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఈ సదుపాయం లేదు. ఇంతకీ ఆ షోలు.. సినిమాలేవంటే..
ఎలా చూడాలంటే...
మీరు చూడాలనుకుంటున్న సినిమా పేరును గూగుల్‌లో టైప్ చేసి, ఆఖరున నెట్‌ఫ్లిక్స్ అని జోడిస్తే... మీకు ఆ సినిమా లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమాకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ "వాచ్ ఇట్ నౌ వితౌట్ సైన్ అప్" అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే... ఆ సినిమాను ఉచితంగా చూసేయొచ్చు. లేదంటే ఈ లింక్ ద్వారా కూడా వెళ్లొచ్చు. అయితే ఈ ఉచిత నెట్‌ఫ్లిక్స్ షోస్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తరచూ మారుతూ ఉంటాయి. ప్రస్తుతం కింద పేర్కొన్న వెబ్ సిరీస్‌లు.. సినిమాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఉచిత వెబ్ సిరీస్‌లు:
స్ట్రేంజర్ థింగ్స్
2016లో వచ్చిన 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్‌సిరీస్ ఘన విజయాన్ని సాధించింది. ఎక్కువ మంది చూసిన షోల్లో ఇది ఒకటి. 1980 దశాబ్దం నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ను తీశారు. హాకిన్స్ అనే పట్టణంలో ఓ బాలుడు కనిపించకుండాపోతాడు. అదే సమయంలో ఓ బాలిక పట్టణంలోకి ప్రవేశిస్తుంది. ఆ బాలుడిని కనిపెట్టడం కోసం అతడి తల్లి, అతడి స్నేహితులు చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో అతీంద్రియ శక్తులు, రాక్షస జీవులతో వారు చేసే పోరాటామే ఈ వెబ్‌సిరీస్ కథ. సైన్స్ ఫిక్షన్, హార్రర్ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో అటుఇటుగా 50 నిమిషాల నిడివితో ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సిరీస్ హిట్ కావడం వల్ల మరో రెండు సీజన్లు వచ్చాయి. నాలుగో సీజన్‌ను గతేడాదే ప్రకటించినా.. కరోనా కారణంగా షూటింగ్ మొదలు కాలేదు.
ఎలైట్
స్పెయిన్‌లో ముగ్గురు పేద విద్యార్థులు ఓ ప్రైవేటు పాఠశాలలో చేరుతారు. అక్కడ చదువుకునే సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, ఈ ముగ్గురికి మధ్య జరిగే ఘర్షణ, ఎదురయ్యే అనుభావాలే నేపథ్యంగా 'ఎలైట్' వెబ్‌సిరీస్‌ను తీశారు. 2018లో విడుదలైన ఈ థ్రిల్లర్ జానర్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ఇందులోనూ ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి.
బాస్ బేబీ: బ్యాక్ ఇన్ బిజినెస్
2017లో వచ్చిన 'బాస్ బేబీ' చిత్రానికి కొనసాగింపుగా నెట్‌ఫ్లిక్స్‌లో 'బాస్ బేబీ: బ్యాక్ ఇన్ బిజినెస్' పేరుతో మూడు సీజన్లు, ఓ స్పెషన్ షో రూపొందించింది. యానిమేటెడ్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ 'బాస్ బేబీ..' తొలి సీజన్ 2018లో విడుదలైంది. ఇందులో బాస్ బేబీ తన సోదరుడు, మరో వ్యక్తితో కలిసి వారు ఉంటున్న ప్రాంతాన్ని ప్రతినాయకుడిని నుంచి కాపాడుతారు. ఎలా రక్షిస్తారన్నది కథాంశం. ఈ సీజన్‌లో అరగంట చొప్పున 13 ఎపిసోడ్లు ఉన్నాయి.
వెన్ దే సీ అస్
నిజం జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను తీశారు. 1989 ఏప్రిల్ 19న న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కులో ఓ మహిళా అత్యాచారానికి గురవుతుంది. దీంతో నగరానికి చెందిన ఐదుగురు టీనేజ్ యువకులను నిందితులుగా భావిస్తారు. నేరం వాళ్లు చేయకపోయినా వారే దోషులుగా తేలడం వల్ల కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తుంది. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత 2003లో నగర ప్రభుత్వంపై ఆ ఐదుగురు న్యాయపోరాటం చేసి 2014లో విజయం సాధిస్తారు. దీన్నే దర్శకురాలు అవా డువెర్నె గతేడాది వెబ్‌సిరీస్‌గా మలిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో గంటకు పైగా నిడివితో నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి.
లవ్ ఈజ్ బ్లైండ్
ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడి మాట్లాడి, ప్రేమించి, పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమే. అయితే లవ్ ఈజ్ బ్లైండ్ కాన్సెప్ట్ వింతగా ఉంటుంది. ఇదో రియాలిటీ షో. నిక్, వానెస్సా లాచే కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 30 మంది అమ్మాయిలు, అబ్బాయిలు పాల్గొన్నారు. వీరిలో ఒక్కో జంట ఒకరినొకరు చూసుకోకుండా పరిచయం చేసుకొని ప్రేమలో పడతారు. అన్ని విషయాలు మాట్లాడుకొని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే కుటుంబపెద్దలతో మాట్లాడతారు. ఇవన్నీ షోలో ప్రసారమవుతుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సిరీస్‌లో 50 నిమిషాలకుపైగా నిడివితో పది ఎపిసోడ్లు ఉన్నాయి.
అవర్ ప్లానెట్
ఇదో డాంక్యూమెంటరీ వెబ్‌సిరీస్. 'అవర్ ప్లానెట్' ద్వారా వాతావరణ మార్పులు మన భూమిపై ఉన్న జీవజాలంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలిపే ప్రయత్నం చేశారు. ప్రకృతి అందాలను, జరగబోయే ప్రకృతి వినాశాన్ని తెలియజేసే వెబ్ సిరీస్ ఇది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సిరీస్‌లో దాదాపు 50 నిమిషాల నిడివితో ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి.
గ్రేస్ అండ్ ఫ్రాంకీ
గ్రేస్.. ఫ్రాంకీ అనే ఇద్దరు వృద్ధ మహిళల చుట్టూ ఈ వెబ్‌సిరీస్ తిరుగుతుంది. వీరిద్దరి భర్తలు న్యాయవాదిలో వృత్తిలో ఒకే చోట కలిసి పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమలో పడతారు. భార్యలకు విడాకులు ఇచ్చి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదే విషయాన్ని ఇళ్లలో ప్రకటించడం వల్ల అందరు షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? గ్రేస్.. ఫ్రాంకీ వారి భర్తలను దక్కించుకోవడం కోసం ఏం చేశారు తెలియాలంటే ఈ వెబ్‌సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆరు సీజన్లు వచ్చాయి. ప్రతి సీజన్‌లో అరగంట చొప్పున 13 ఎపిసోడ్లు ఉన్నాయి.
ఉచిత సినిమాలు:
మర్డర్ మిస్టరీ
క్రైమ్ థ్రిల్లర్-కామెడీ జోనర్‌లో 2019 జూన్‌లో 'మర్డర్ మిస్టరీ' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. పెళ్లయిన ఓ జంట హనీమూన్ కోసం యూరప్‌కు వెళ్తుంది. అక్కడ ఒక ఓడలో వీరు ప్రయాణిస్తుండగా ఓ సంపన్నుడు హత్యకు గురవుతాడు. ఆ నేరం ఈ జంటపై పడుతుంది. వీరిద్దరు కలిసి ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాలుగువారాల్లో అత్యధిక మంది వీక్షించిన చిత్రాల్లో 'మర్డర్ మిస్టరీ' ఐదో స్థానంలో నిలిచింది.
బర్డ్ బాక్స్
2018 డిసెంబర్‌లో 'బర్డ్ బాక్స్' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఒక ప్రాంతంలో దుష్టశక్తుల వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆ శక్తుల నుంచి ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు ఎలా బయటపడ్డారనేది ఈ చిత్రం కథ. హర్రర్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన సినిమాల్లో ఒకటి.
ది టూ పోప్స్
వాటికన్స్ సిటీ పోప్స్ జీవితాల నేపథ్యంలో 'ది టూ పోప్స్' సినిమా సాగుతుంది. 2005లో బ్యూనోస్ ఎయిర్స్‌లో ఆర్కోబిషప్‌గా ఉండే జోర్గ్ మారియో బెర్గోగ్లియో(ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్) వాటికన్ సిటీ పోప్ స్థానానికి పోటీ చేస్తారు. కానీ జర్మనీకి చెందిన జోసెఫ్ రాట్జింగర్ పోప్ బెనడిక్ట్ XVIIగా ఎన్నికవుతారు. ఏడేళ్ల తర్వాత బెర్గోగ్లియో తన ఆర్క్‌బిషప్ పదవికి రాజీనామా చేయబోతే పోప్ బెనెడిక్ట్ వాటికన్ సిటీకి రమ్మంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి వారి వ్యక్తిగత జీవితాల గురించి, అభిరుచుల గురించి మాట్లాడుకుంటారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని బెర్గోగ్లియోను బెనడిక్ట్ కోరుతారు. ఆ తర్వాత బెర్గోగ్లియో పోప్ ఫ్రాన్సిస్‌గా మారతారు. ఈ చిత్రం 2019 డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.