హెచ్‌ఐసీసీలో జరిగిన 'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో నాని కీలక వ్యాఖ్యలు చేశారు. "పరిస్థితులు బాగోనప్పుడు కాదు పరిస్థితులు బాగుండి, నా చిత్రాల్ని థియేటర్లలో కాకుండా ఓటీటీకి ఇచ్చినప్పుడు ఎవరో చేయాల్సిన అవసరం లేదు నటుడిగా నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా" అని నాని అన్నారు. ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌పై ఇటీవల ఎగ్జిబిటర్లు అన్న మాటలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"భావోద్వేగాల్ని తెరకెక్కించడంలో శివ నిర్వాణకి మంచి పట్టుంది. మేమిద్దరం కలిసి చేసిన 'నిన్నుకోరి', ఆయన గత చిత్రం 'మజిలీ'కి మించిన ఎమోషన్ 'టక్ జగదీష్'లో ఉంటుంది. కుటుంబ సమేతంగా చూసే ఈ సినిమా వినాయక చవితికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం చూసిన వారికి ఆనందభాష్పాలు రావడం గ్యారెంటీ. సినిమా పూర్తయ్యాక పండగరోజు చాలా బాగా గడిచిందని ఫీలవుతారు. ఈ కథ, పోరాట సన్నివేశాల గురించి శివ నాతో చెప్పినప్పుడు ఎమోషనే కాదు యాక్షన్‌లోనూ ఆయనకి గ్రిప్ ఉందని అర్థమైంది. ఇది ఇప్పటి వరకు మనం చూడని కొత్త నేపథ్యంలో సాగే కథ కాదు. ఉత్కంఠపెంచే మలుపులు తదితర అంశాలు ఉండవు. బాల్యంలో మనం చూసిన పండగలాంటి సినిమాల్ని ఇప్పుడు మిస్ అవుతున్నాం. ఆ లోటుని తీరుస్తూ, మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేసే చిత్రమిది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నామని నాపై కొందరు ఆరోపించారు. వారిపై నాకు గౌరవం ఉంది. వాళ్లున్న పరిస్థితుల్లో అలా స్పందించడం తప్పేం కాదు. నాని వాళ్ల కుటుంబ సభ్యుడే. నేనూ వాళ్లలో ఒకడినే. ఆ కాసేపు బయటివాడ్ని చేశారనే బాధ ఉంది. పరిస్థితులు బాగోనప్పుడు కాదు పరిస్థితులు బాగుండి, నా చిత్రాల్ని థియేటర్లలో కాకుండా ఓటీటీకి ఇచ్చినప్పుడు ఎవరో చేయాల్సిన అవసరం లేదు నటుడిగా నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా" అని నాని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సందడి చేయాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కొవిడ్ లాక్‌డౌన్ ముగిశాక థియేటర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఓటీటీకే మొగ్గుచూపారు నిర్మాతలు.
బ్యాన్ చేస్తాం
ఈ క్రమంలోనే థియేటర్స్‌ను కాపాడాలంటూ ఆగస్టు 20న ఫిలించాబర్లో జరిగిన సమావేశంలో ఓటీటీ రిలీజ్‌లను ఎగ్జిబిటర్లు తప్పుబట్టారు. ఇందులో భాగంగా 'టక్ జగదీశ్' సినిమాను ప్రస్తావిస్తూ.. ఈ చిత్ర నిర్మాతలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. నాని సినిమాలను ఇకపై థియేటర్లలో విడుదల చేయమని అన్నారు.
స్పందించిన థియేటర్స్ అసోసియేషన్
ఈ నేపథ్యంలో అప్పుడే దీనిపై స్పందించిన థియేటర్స్ అసోసియేషన్.. తాము ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యలేదని, తమ ఉద్దేశం అది కాదని తెలిపింది. ఎగ్జిబిటర్లు తమ మాటలతో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అంటూ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
కాగా, ఇటీవల తన సపోర్ట్ ఎప్పుడూ థియేటర్లకు ఉంటుందని అన్నారు నాని. 'టక్ జగదీశ్' రిలీజ్ విషయం నిర్మాతల ఇష్టం అని చెప్పారు.
ఇదీ చూడండి: Tuck Jagadish: అలరిస్తున్న 'టక్ జగదీష్' ట్రైలర్