కరోనా వైరస్ బారినపడిన సామాన్యులు ఎలా విజేతలుగా నిలిచారనే విషయంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేస్‌బుక్ వేదికగా ఈ చర్చను ఆయన నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యను నామినేట్ చేశారు. ఇటీవల చైతూ... సునీత అనే నర్సుతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఇప్పుడు ఈ బృహత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను చైతన్య నామినేట్ చేశారు.
కొవిడ్-19ను జయించిన సునీత అనే నర్సుతో చైతన్య గత వారం ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. ఈ చర్చలో సునీత మాటలు చాలా సహాయకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. "‘కరోనా సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. నిజానికి తీవ్ర భయం, ఒత్తిడికి గురవ్వడం వల్లే ఎక్కువ సమస్యలొస్తాయి. ఈ భయాలతోనే చాలా మందిలో వైరస్ లక్షణాలున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ముందు ఇలాంటి అనవసర భయాల్ని వీడండి" అని నాగచైతన్య కోరారు.