'బాహుబలి' సినిమా.. పాటలు.. ఆ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో 'దండాలయ్యా' పాటతో అలరించాడు కీరవాణి తనయుడు కాలభైరవ. ఎంతో పేరు తెచ్చుకున్న ఈ పాటను అనుకోకుండా పాడాడట భైరవ. తండ్రి లేని సమయంలో సరదాగా పాటను పాడి తండ్రి వినేలా చేసి ఆ సినిమాలో పాడటానికి ఛాన్స్ కొట్టేశాడు. తర్వాత 'అరవింద సమేత'లోని 'పెనిమిటి' పాట పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సంగీత దర్శకుడిగానూ..
గాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న తరుణంలోనే సంగీత దర్శకుడిగానూ మారాడు. రితేశ్ రానా దర్శకత్వంలో తన సోదరుడు శ్రీసింహ హీరోగా పరిచయం కానున్న 'మత్తు వదలరా' చిత్రానికి సంగీతం అందించాడు. నేడు(బుధవారం) విడుదల అవుతున్న ఈ చిత్రానికి చెర్రీ నిర్మాత. ఈ తరుణంలో కాలభైరవ హైదరాబాద్‌లోని విలేకర్లతో ముచ్చటించాడు.
కలలో కూడా ఊహించలేదు..
'మత్తు వదలరా' చిత్రబృందంలో చివరిగా చేరింది నేనే. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక అయిన తర్వాత సంగీత దర్శకుడిగా నన్ను తీసుకున్నారు. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. తమ్ముడు శ్రీసింహ తెరంగేట్రం చేస్తున్న సినిమాలో నేనూ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతానని కలలో కూడా ఉహించలేదు.
ఉద్వేగానికి గురయ్యా..
నాకు షూటింగ్‌లు అంటే చాలా బోర్. అందుకే ఒక్క రోజు కూడా 'మత్తు వదలరా' సెట్‌కు వెళ్లలేదు. కానీ రషెష్ చూసినప్పుడు సంతోషంగా అనిపించింది. ఓ ప్రేక్షకుడిలా సినిమాలో లీనమైపోయా. రితేశ్ చెప్పినదానికంటే బాగా తీశాడు. మూవీ చూశాక ఓ ఉద్వేగానికి గురయ్యా. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను.
ఆ ఆలోచనే రాలేదు..
ఎవరైనా సంగీత దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్నప్పుడు మంచి పాటలకు అవకాశం ఉన్న కథ దొరికితే బాగుంటుంది అనుకుంటారు. కానీ నేను అలా అనుకోలేదు. నాకు అవకాశం దొరకడమే గొప్ప అనుకున్నా. ఈ సినిమాలో పాటలకు స్థానం లేదు. ఒక్క పాట ఉండుంటే బాగుంటుంది కదా.. అనే ఆలోచనే రాలేదు. పాట పెడితే, కథ పాడైపోతుంది. రీరికార్డింగ్‌లో నేను వినిపించే అవకాశం ఉంది కాబట్టి, దానిపై దృష్టి పెడితే సరిపోతుందనిపించింది. నా ప్రతిభని నూటికి నూరు శాతం చూపించే ప్రయత్నం చేశా. ప్రేక్షకులకు ఏమేర నచ్చుతుందో చూడాలి.
నాన్నలో ఆ లక్షణం బాగా ఇష్టం
నేను సంగీతాన్ని ప్రత్యేకంగా నేర్చుకోలేదు. నాన్నగారిని చూస్తూ.. ఆయన దగ్గర పనిచేస్తూ.. ఎదిగా. కోరస్‌లు పాడా. ఆయన ట్యూన్ కట్టే విధానం ఎలా ఉంటుందో దగ్గరుండి తెలుసుకున్నా. నాన్నగారు అన్ని రకాల జోనర్లకూ పనిచేశారు. ఆయన ఏ భాషలో సంగీతం అందిస్తే.. ఆ భాష సౌందర్యం, నేటివిటీ ఆ పాటలో కనిపిస్తాయి. ఓ హిందీ పాట కంపోజ్ చేస్తే, ఆ ప్రాంతంలో పుట్టి, ఆ భాషని ఔపోసన పట్టిన సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్‌లానే ఉంటుంది. నాన్నగారిలో ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. సంగీత దర్శకులంతా నాకిష్టమే. ఇళయరాజా, రెహమాన్ లెజెండ్స్. ఈ తరంలో తమన్, అనిరుధ్‌లు కూడా ఇష్టమే.
పదేళ్ల తరవాత నా పేరు గుర్తురావాలి
ఈ సినిమాకి సంబంధించి నాన్న నాకేం సలహాలూ సూచనలు ఇవ్వలేదు. నేనే కొన్ని ఎపిసోడ్లు చూపించి "ఈ సందర్భానికి ఇలాంటి నేపథ్య సంగీతం సరైనదేనా" అని అడిగి నా సందేహాలు తీర్చుకున్నా. నాకూ అన్ని రకాల కథలకూ సంగీతం అందించానని ఉంది. ఓ పదేళ్ల తరవాత నా పేరు గుర్తుకురాగానే ఏదో ఓ జోనర్ గురించి చెప్పుకోకూడదు. "వీడు అన్ని రకాల పాటలూ అందించాడు" అనే అనుకోవాలి. అన్నిటికంటే ముందు 'మత్తు వదలరా' ప్రేక్షకులకు నచ్చాలి. నా పని తనానికి గుర్తింపు రావాలి. అదే నా ముందున్న లక్ష్యం.
ఇవీ చూడండి.. రష్మీని 'లేడీ అర్జున్‌రెడ్డి' అనడానికి కారణమేంటి?