రెండు శరీరాలు... ఒకే ప్రాణం, రెండు హృదయాలు... ఒకే స్పందన, రెండు మెదళ్లు... ఒకే ఆలోచన, రెండు కలాలు... ఒకే సృజన. ఔను... వారిద్దరి దేహాలు వేరయినా ఆత్మ ఒకటే. చేపట్టిన వృత్తి ఒకటే. చేరుకోవాలన్న లక్ష్యం ఒక్కటే. తెలుగు చిత్ర సీమలో 350కి పైగా చిత్రాలకు కథలు, మాటలు అందించిన రచయితల ద్వయం పేరు... పరచూరి బ్రదర్స్.
ఒంటి పేర్లతో కాకుండా కేవలం ఇంటి పేరుతోనే వీరు సుపరిచితులు. ఈ రచయితల సృజనకి సంబంధించి ఒక చిత్రానికి ఎవరు ఎంత మేర తమ కాంట్రిబ్యూషన్ ఇచ్చారో... తేల్చి చెప్పడం... మనకే కాదు ఆ రచయితల ద్వయానికీ అంతు పట్టని కథే. ఇద్దరు వ్యక్తులుగా పైకి కనిపించినా... రచయితలుగా ఒకే పేరుతో ప్రతిష్ఠ సంపాదించుకున్నారు. కనుక... ఎవరి గురించి మాట్లాడబోయినా మరొకరి ప్రస్తావన తప్పనిసరవుతుంది. అంతలా ఒక్కరుగా ఆ ఇద్దరూ మమేకమై పోయారు. వ్యక్తిగత గుర్తింపు కన్నా మిన్నగా జంట గుర్తింపునే కోరుకున్నారు. అదే బాటలో నడిచారు. ఇంకా...నడుస్తూనే ఉన్నారు.
పరచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరచూరి వెంకటేశ్వరరావు జూన్ 21న జన్మించారు. నాటక రచయిత, నటుడు, సంభాషణల రచయిత, దర్శకుడు... ఇలా అనేక రకాలుగా సినిమా సేవకు వెంకటేశ్వరరావు అంకితమయ్యారు. సన్నివేశానికి తగ్గట్లు మాటల తూటాలు పేల్చడం, హీరోలకు వ్యక్తిత్వం ఉన్న పవర్ ఫుల్ పాత్రల్ని రూపొందించడం సహా ఉత్కంఠ గొలిపే కథాకథనాలతో ప్రేక్షకుల్ని కదలనీయకుండా చేయడం ఈ జంట కలానికి ఉన్న ప్రత్యేకత. సినీరచనలో ఉన్న దమ్ముని అన్నదమ్ములు చూపించారు. చిత్రపరిశ్రమకు ఈ ఇద్దరు అన్నదమ్ములని వెంకీ, గోపి... అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటుంది. వెంకటేశ్వరరావు లోని ముక్కుసూటి తనం ప్రత్యేకత.
మొదట్లో ఎర్ర సినిమాలు
కెరీర్ బిగినింగ్‌లో పరచూరి బ్రదర్స్ ఎన్నో విప్లవాత్మక సినిమాలకు రచన చేసారు. చలిచీమలు, మరో మలుపు, ఈ చరిత్ర ఏ సిరాతో?, ఇది కాదు ముగింపు, రోజులు మారాయి... అనే సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లు లేకున్నా జనాదరణ రావడానికి వీరి రచనే కారణం. తక్కువ బడ్జెట్, అందుబాటులో ఉన్న లొకేషన్స్, అభిరుచిగల నటీనటులు... ఇవీ ఈ సినిమాలకు ప్రధాన ఆకర్షణలు. అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడుతూ విజయ ఢంకా మోగిస్తూ ముందుకు సాగుతుంటే... ఇండస్ట్రీ కన్ను ఈ రచయితల మీద పడింది. అంతే...ఇక ఈ రచయితలకు అహర్నిశలూ పనే. ఇండస్ట్రీలో బిజీ రచయితలుగా మారిపోయారు.
దర్శకులుగా
దర్శకులుగానూ ఈ రచయితల ద్వయం అనేక సినిమాలు రూపొందించారు. 'కాయ్ రాజా కాయ్', 'శ్రీ కట్న లీలలు', 'భలే తమ్ముడు', 'రేపటి స్వరాజ్యం', 'ప్రజాస్వామ్యం', 'మా తెలుగు తల్లి', 'సర్పయాగం', 'మరో క్విట్ ఇండియా', 'సింగన్న' చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటులుగా పలుచిత్రాల్లో మంచి పాత్రల్లో నటించారు. 1993లో 'ఆశయం' సినిమాలో నటించిన పరచూరి వెంకటేశ్వరరాఫుకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డు లభించింది.
పురస్కారాలు
- 1986లో 'ప్రతిధ్వని' సినిమాకి కథని అందించినందుకు ఉమ్మడి రాష్ట్ర నంది పురస్కారం లభించింది.
- 1990లో 'కర్తవ్యం' సినిమాకి మరో నంది నడిచి రాగా ...చెన్నై లోని కళాసాగర్ అవార్డు కూడా వారిని వరించింది.
- 1993లో 'ఆశయం' సినిమాకి కథ అందించినందుకు నంది అవార్డుతో పాటు సినీ గోయర్స్ అవార్డు కూడా లభించింది.
- 1990లో కొదమ సింహం సినిమాకి బెస్ట్ స్కీన్ర్ ప్లే రైటర్స్‌గా వంశీ బర్కలీ పురస్కారం లభించింది.
బెస్ట్ ఫిలిం డైరెక్టర్‌గా 'ప్రజాస్వామ్యం' సినిమాకు రసమయి అవార్డుతోపాటు మరోసారి నంది పురస్కారాన్ని పరచూరి బ్రదర్స్ అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్స్‌గా 'ఈనాడు' చిత్రానికి సితార అవార్డు.. 'కర్తవ్యం', 'పీపుల్స్ ఎన్ కౌంటర్' సినిమాలకి కళాసాగర్ అవార్డు.. 'సుందరకాండ' సినిమాకి లలిత కళాసాగర్ అవార్డు.. 'కుంతీ పుత్రుడు' సినిమాకి వంశీ బర్కలీ అవార్డు... 'మేజర్ చంద్రకాంత్'కు కళాసాగర్ అవార్డు.. 'గణేష్' చిత్రానికి నంది అవార్డు.. 'సమరసింహారెడ్డి'కి యువకళావాహిని, అప్ సినీ గోయర్స్ అవార్డు...ఇలా అనేకానేక సాంస్కృతిక సంస్థలు పరచూరి బ్రదర్స్ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా సన్మానించాయి.
ఇదీ చూడండి... కాళ్లతో గీసిన పెయింటింగ్‌కు అమితాబ్ ఫిదా