మా ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు: బండి సంజయ్
'మా' అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుతో సహా ఇరు ప్యానెళ్లలోని విజేతలందరికీ భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌చేశారు. 'మా' ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూశారన్నారు. 'మా' ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని, అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
విష్ణును ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: మోహన్‌బాబు
'మా' ఎన్నికల్లో విష్ణును ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. ఇక నుంచి 'మా' ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా చూసుకుంటామని తెలిపారు. జరిగిందేదో జరిగింది అని, అందరం ఒకే కుటుంబం అని మోహన్‌బాబు అన్నారు. ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. అధ్యక్షుడికి చెప్పకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లవద్దని గెలిచిన సభ్యులకు సూచించారు.
'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా
'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు. మంచు విష్ణు గెలిచిన కొద్దిసేపటికే నాగబాబు ఈ నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో 'మా' కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టంలేకే రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. 48 గంటల్లో రాజీనామాను 'మా' కార్యాలయానికి పంపుతానన్నారు. ఎంతగానో ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి చిత్తశుద్ధితో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని నాగబాబు తెలిపారు.
మంచు విష్ణుకు అభినందనలు తెలిపిన చిరంజీవి
'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. 'మా' ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.
ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టిన విష్ణు
'మా' ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టారు. ఈ గెలుపు మా నాన్నగారిది అని మంచు విష్ణు అన్నారు. 'మా' ఎన్నికలు ఇంత దూరం వచ్చి ఉండకూడదన్నారు. మేమంతా ఒకే కుటుంబం అని, కలిసి పనిచేస్తామని విష్ణు అన్నారు. ఇది తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి దక్కిన విజయమన్నారు.