నాగచైతన్య, సాయిపల్లవి(Lovestory movie success) జంటగా నటించిన సినిమా 'లవ్‌స్టోరీ' సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను ఉర్రూతలూగించి సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఆ అద్భుతాన్ని చేసి చూపింది తెలుగింటి కుర్రాడు పవన్ సీహెచ్(love story pawan ch music director). అయితే ఇదంతా అంతా సులువుగా జరగలేదు. అతడి(love story music director) కెరీర్ గురించి తన మాటల్లోనే...
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఎన్నో తలపులు ఏవో కలతలు- బతుకే పోరవుతున్నా... గాల్లో పతంగిమల్లె ఎగిరే కలలే నావి' - 'లవ్ స్టోరీ'లోని(Lovestory movie) 'హేయ్ పిల్లా' పాటలో వచ్చే ఈ వాక్యాలంటే నాకు చాలా ఇష్టం! ఎందుకో ఒకనాటి నా మానసిక స్థితిని ఇవి గుర్తుచేస్తుంటాయి. ఆరేళ్లకిందటి మాట ఇది. అప్పట్లో ముంబయిలో ఉండేవాణ్ణి. మ్యూజిక్ కాలేజీ నుంచి బయటకొచ్చి తొలిసారి జీవితాన్ని నేరుగా ఎదుర్కొంటూ ఉన్నాను. సినిమాలకన్నా 'అంతర్జాతీయ సంగీత' రంగంలో పేరు తెచ్చుకోవాలని కలలు కంటుండేవాణ్ణి. నాతోపాటూ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉండేవాళ్లు. తిండీనిద్రా మర్చిపోయి రోజంతా ఏవేవో కొత్త సంగీత శబ్దాలు సృష్టిస్తూ... పాడుతూ... బాణీల్లో రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాళ్లం. ఇంతచేస్తున్నా మాకు తగ్గ వేదిక దొరకలేదు. 'ఇండిపెండెంట్ మ్యూజిక్ సంస్థలేవీ అవకాశాలివ్వలేదు.
వాటితో విసిగివేసారి సినిమాల్లోకన్నా వెళదామనుకున్నాను... అక్కడేదో నాకు ఎర్రతివాచీ వేసి పిలుస్తారనే ఆశతో. అక్కడా చుక్కెదురైంది. ఓ రెండు సినిమాలు పాటలన్నీ ఇచ్చాక... పట్టాలకెక్కినట్టే ఎక్కి ఆగిపోయాయి! దాంతో ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితి. నేను ఆ నిస్పృహలో కొట్టుమిట్టాడుతుండగానే... ఏఆర్ రెహ్మాన్‌గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘నాతో పని చేస్తావా...' అని అడిగారు. ఆయన నా అభిమాన సంగీతదర్శకుడు మాత్రమే కాదు... ఒకప్పటి మా ప్రిన్స్‌పాల్ కూడా. ఆయన నడుపుతున్న 'కేఎం కన్జర్వేటరీ' మ్యూజిక్ కాలేజీ మాజీ విద్యార్థిని నేను. ఏడాదికి వందమంది కాలేజీ నుంచి బయటకొస్తుంటే... మా ‘ప్రిన్స్‌పాల్’ నన్ను మాత్రమే గుర్తుపెట్టుకుని పిలవడంకన్నా ఆనందం ఏముంటుంది. వెంటనే... ఆయన ముందు వాలిపోయాను. అలా వెళ్లగానే ఆయన నాకు పని అప్పగించలేదు... ఓ పెద్ద పరీక్షే పెట్టారు. అదేమిటో చెప్పేముందు...
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అనుకోకుండానే..
'జన్మమెత్తితిరా అనుభవించితిరా...' - అలనాటి ఎన్టీఆర్ సినిమా 'గుడిగంట'ల్లోని ఈ పాటను ఎప్పుడైనా చూశారా! అలల హోరును పాట మూడ్‌కి తగ్గట్టు రకరకాలుగా చిత్రీకరిస్తూ... కంటికి ఇబ్బంది కనిపించని లైటింగ్‌తో... 1960ల్లోనే చక్కటి లాంగ్ షాట్స్‌తో చిత్రీకరించారు. ఆ కెమెరా పనితనం మా తాతయ్య సి.నాగేశ్వరరావుది. చెంచులక్ష్మి, పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, పరమానందయ్య శిష్యుల కథ, అన్నదాత, ఆరాధన, ఆస్తులూ అంతస్తులు... వంటి ఎన్నో లెజెండరీ సినిమాలకి పనిచేసినవారాయన. ఆయన ఆకస్మికంగా చనిపోయేనాటికి మా నాన్న విజయ్‌కుమార్‌కు తొమ్మిదేళ్లు! ఆదుకునేవాళ్లు ఎవరూ లేకపోవడం వల్ల ఆ చిన్న వయసులోనే సినిమా స్టూడియోల్లో పనిచేయడం మొదలుపెట్టారు నాన్న.
టీనేజీలోనే కెమెరా టెక్నిక్స్ నేర్చుకుని జంధ్యాల సినిమా 'వివాహభోజనంబు'తో సినిమాటోగ్రాఫర్ అయ్యారు. నేను పుట్టాక 'అమ్మోరు' సినిమా చేశారు. కెమెరా పనితనం పరంగా దానికి మంచి పేరు రావడంత వల్ల మా కుటుంబం కాసింత నిలదొక్కుకుందని చెప్పాలి. ఇంటికి పెద్దగా ఒంటిచేతిమీదే నాన్న అత్తయ్యలూ, బాబయ్యల పెళ్ళిళ్లన్నీ చేశారు. ఆ క్రమశిక్షణా, కష్టపడేతత్వాన్నే మాకూ నేర్పారు. ఇంట్లో నేనూ, అన్నయ్యా... ఇద్దరమే. మేం సినిమాల్లోకి రావాలని నాన్న ఎప్పుడూ కోరుకున్నదీ లేదు... మితభాషి కాబట్టి మాతో ఏ సినిమా విశేషాలూ పంచుకున్నదీ లేదు. మా అన్నయ్య మామూలుగానే ఇంజినీరింగ్ చదివి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నేనూ అదే చేయాలనుకున్నాకానీ... ఇంటర్‌లో అను కోకుండా నా దృష్టి సంగీతం వైపు మళ్ళింది. మా స్నేహితులు కాలేజీ కల్చరల్స్ కోసం సంగీతం నేర్చుకుంటూ ఉంటే నేనూ ఉత్సాహంగా కీబోర్డు నేర్చుకున్నాను. ఐఫోన్ సాయంతో చిన్నగా మ్యూజిక్ కంపోజ్ చేయడం ప్రారంభించాను. డిగ్రీకి వచ్చాక అదో పిచ్చిలా మారింది నాకు. నాలోని ఈ సంగీత ఆసక్తిని మొదటిసారి గుర్తించింది మా అన్నయ్యే. తన సలహాతోనే డిగ్రీ కాగానే ఏఆర్ రెహ్మాన్ నడుపుతున్న 'కేఎం కన్జర్వేటరీ'కి దరఖాస్తు చేసుకున్నాను. ఆ కాలేజీకి సెలెక్ట్ కావడమే నా జీవితంలో తొలి మలుపు...
ఫక్తు ప్రిన్స్‌పాలే..
'మీ చుట్టూ ఉన్న ప్రతి శబ్దాన్నీ రికార్డు చేసుకోండి... పక్షి కూతా కీచురాళ్ల సవ్వడీ ఫ్యాన్ చప్పుడూ... ఇలా ఏదైనా సరే. ఆ చప్పుళ్లలోని లయని పట్టుకోండి. దాన్ని మీ వాయిద్యాలతో సంగీతంగా మలచగలరేమో చూడండి. అవి మీకు కలిగించే అనుభూతినీ, జ్ఞాపకాలనీ బాణీలుగా మార్చడం నేర్చుకోండి...' సంగీతాన్ని ఇంత విభిన్నంగా నేర్పించేవారు కేఎం కన్జర్వేటరీలో! రెహ్మాన్‌గారి చెల్లెలు ఫాతిమా ఆ కాలేజీ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూస్తే... పాశ్చాత్య సంగీత నిపుణులు జేమ్స్ బంచ్, ఆడమ్ గ్రెగ్ నాకు ప్రధాన మెంటార్‌లుగా ఉండేవారు. ప్రిన్స్‌పాల్‌గా ఏఆర్ రెహ్మాన్ ఏడాదికి ఒక్కసారే వచ్చేవారు. ముందు నుంచీ నేను బాణీలు కట్టడం(కంపోజింగ్), సంగీత వాయిద్యాల కూర్పు(ప్రోగ్రామింగ్)లపైనే ఎక్కువగా దృష్టిపెట్టాను. దానిపైన మూడేళ్లపాటు థియరీ, రకరకాల సంగీతవాయిద్యాలపైన సాధన చేయించాక... నాలుగో ఏడాది నన్ను ప్రాక్టికల్స్‌లోకి దించారు. అదీ ఎలా అనుకున్నారు... ఓ కంపోజింగ్ గదిలో నన్ను పెట్టి బయట తాళం వేసేవారు. ఆ ఏకాంతంలో నాకు తోచిందంతా సంగీత భాషలో 'నొటేషన్‌లు'గా రాయమనేవారు! రోజులో ఎనిమిది గంటలపాటు అలా రాస్తూ ఉండాల్సిందే. అలా ఏడాది చేశాను! ఆ సాధన కంపోజింగ్‌పైన పూర్తిస్థాయిలో పట్టుసాధించేలా చేసింది. నేను ఆ రకంగా కంపోజ్ చేసిన మూడు పాటల్ని... కోర్సు చివర్లో జరిగే వేడుకల్లో వినిపించారు. దానికి ఏఆర్ రెహ్మానే అతిథిగా వచ్చారు! నా పాటల్ని విన్న ఆయన దగ్గరకి పిలిచి 'వీటి వెనకాలున్న నీ ఆలోచనలేమిటీ? ఫలానా సౌండ్ ఎలా క్రియేట్ చేశావు?' అంటూ చిన్నసైజు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన నా మెంటార్‌ను పిలిచి మాట్లాడారట. అప్పటికి రెహ్మాన్ మనసులో ఏముందో తెలియదుకానీ... నేను మాత్రం కోర్సు పూర్తిచేసుకుని 'అంతర్జాతీయ సంగీతాన్ని' సృష్టించాలనే కలలతో ముంబయి చేరాను. అక్కడ సరైన అవకాశాల్ని దక్కించుకోలేక... ఇటు సినిమాలూ రాక... నిరాశలో కొట్టుమిట్టాడాను. అప్పుడే నన్ను ఎప్పుడో మరచిపోయుంటారనుకున్న ఏఆర్ రెహ్మాన్‌గారు పిలిచి... ఆ పరీక్ష పెట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అదేమిటంటే..
రెహ్మాన్(ar rahman love story movie) తన సంగీతం కోసం రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతుంటారని వినే ఉంటారు! అలా ఆయన ఎప్పుడో 'మాడ్యులర్ సింథసైజర్' అనే పరికరాన్ని తెచ్చుకున్నారు. అదో చిన్న టెలిఫోన్ ఎక్సేంజిలా ఉంటుంది. దానికున్న వైర్లను రకరకాలుగా మార్చి పెడుతూ ఉంటే... కొత్త కొత్త సంగీత శబ్దాలని సృష్టిస్తుంది. రెహ్మాన్ దీన్ని 2010లోనే భారత్‌కి తెచ్చినా... దాన్ని వాడేంత తీరికా ఓపికా లేక స్టూడియోలో అలాగే వదిలేశారు. 2016లో నేను ముంబయి నుంచి వెళ్లినప్పుడు నాకు ఆ 'మాడ్యులర్ సింథసైజర్'ను చూపించి 'దీన్ని ఉపయోగించి కొత్తగా ఏమైనా చేయగలవా...' అన్నారు. అదే ఆయన పెట్టిన పరీక్ష. రెహ్మాన్ కూడా పెద్దగా వాడని ఆ పరికరమే ఆ క్షణం నుంచీ నా ప్రపంచమైంది. వారంపాటు దానిపైన రకరకాలుగా కుస్తీపడితేకానీ అందులో నుంచి నేను ఆశించిన సంగీత శబ్దాలు రాబట్టుకోలేకపోయాను. మెల్లగా ఆ శబ్దాలతో స్వరాలూ పలికించడం ప్రారంభించాను. ఈ కొత్త పరికరంతో నావైన నాలుగైదు బాణీలు సిద్ధంచేసుకున్నాను. కొన్ని నెలల తర్వాత రెహ్మాన్‌గారు సడెన్‌గా నా దగ్గరకు వచ్చి 'మాడ్యులర్‌ను వాడావా?' అని అడిగారు. 'వాడటమే కాదు ఆల్బమ్ కూడా చేశాను. వినండి...' అంటే నమ్మలేనట్టు చూసి, ముందు ఓ మూడు నిమిషాల పాట వినడం మొదలుపెట్టారు. ఆ మూడు నిమిషాల్లో 'ఈ సౌండ్ ఎలా వచ్చింది... ఇదెలా చేయగలిగావ్' అంటూ ముప్పై ప్రశ్నలు గుప్పించారు. అన్నింటికీ జవాబు చెప్పాక సంతృప్తిగా తలాడిస్తూ వెళ్లిపోయారు. అప్పటి నుంచీ రెహ్మాన్‌కి పూర్తిస్థాయి సహాయకుడిగా మారాను. మొదట్లో 'సచిన్'లాంటి సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలకి నేపథ్యసంగీతం అందివ్వాలని ప్రోత్సహించారాయన. అలా వరసగా మణిరత్నంగారి 'నవాబ్', విజయ్ 'సర్కార్', 'అదిరింది' వంటి ఎన్నో సినిమాలకు పనిచేశాను. ప్రతి సినిమాకీ నాకు క్రెడిట్ ఇచ్చారు. విదేశీ కచేరీల్లో 'మాడ్యులర్' వాయించడానికి రెహ్మాన్ నన్నే తీసుకెళ్లేవారు. శ్రీదేవి చివరి సినిమా 'మామ్'కైతే పూర్తి స్వేచ్ఛనిచ్చి కీలక సన్నివేశాలకీ, పాటలకీ సంగీతం అందించమన్నారు. ఆ సంగీతానికి జాతీయ అవార్డు వచ్చింది.
శేఖర్ కమ్ముల కోసం..
2018 నుంచే నేనూ సొంతంగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. 'ఫిదా' కోసం నాతోపాటూ మరో ఆరేడుగురు కొత్త సంగీత దర్శకులం ప్రయత్నించినా ఎవరికీ అవకాశం రాలేదు. నాన్న 'ఆనంద్' నుంచీ శేఖర్ కమ్ముల దగ్గరే పనిచేస్తున్నా ఆయనెప్పుడూ నా గురించి చెప్పలేదు. నేనూ నాన్నకు చెప్పకుండానే 'లవ్ స్టోరీ' సినిమా అవకాశం కోసం ప్రయత్నించాను. ముందుగా 'హేయ్ పిల్లా' పాట బాణీనే పంపాను. అది శేఖర్‌గారికి నచ్చాకే 'ఎవరీ అబ్బాయ'ని ఆరా తీయడం ప్రారంభించారట. కెమెరామన్ విజయ్‌కుమార్‌గారి అబ్బాయని చెబితే చాలా ఆశ్చర్యపోయారట. అలా నన్ను లవ్‌స్టోరీకి తీసుకున్నారు. మీకు తెలుసో లేదో... శేఖర్‌గారు అలనాటి భానుమతిగారి నుంచి నేటి లేడీ గాగా దాకా ప్రపంచంలో వచ్చే ప్రతిపాటనీ వింటారు... చక్కగా పాడతారు కూడా! ప్రపంచ సంగీతంపైన అంత పట్టుంది కాబట్టే అంత చక్కటి పాటలు తీసుకుంటారు. నిజానికి, 'లవ్ స్టోరీ'లో పాటలన్నీ సూపర్‌హిట్ అనిపించు కున్నాయంటే... అందులో సగం క్రెడిట్టే నాది. మిగతాదంతా ఆయనదే! తాతయ్య నాగేశ్వరరావుగారికి... తన పిల్లలందరూ సంగీతంవైపు వెళ్లాలనే కోరిక ఉండేదట. అందరికీ గురువు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్పించారట కూడా. ఆయన చనిపోవడంత వల్ల పొట్టకూటి కోసం నాన్న కెమెరాను పట్టుకున్నాక... సంగీత సాధనకి పూర్తిగా దూరమైపోయారు. ఈ మధ్య 'లవ్ స్టోరీ' పాటలన్నీ వరసగా విన్నాక... ఎప్పుడూ అంతగా మాట్లాడని నాన్న- నాతో ఈ విషయాలన్నీ నెమరేసుకున్నారు. తాతయ్య కోరిక ఇలా నా ద్వారా నెరవేరిందంటూ అక్కున చేర్చుకుని అభినందించారు. ఆ అభినందన... సినిమా విడుదలకి ముందే నాకు దక్కిన అవార్డుగా అనిపించింది!
ఇదీ చూడండి: