Leonardo DiCaprio Ukraine: హాలీవుడ్ సూపర్‌స్టార్, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఉక్రెయిన్‌కు తన వంతు సాయం చేశారు. 10 మిలియన్ డాలర్లు (రూ.77కోట్లు) విరాళంగా అందించారు. రష్యా దాడులతో భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశానికి అండగా నిలిచారు. అయితే తాను సాయం చేసిన విషయాన్ని డికాప్రియో గుట్టుగా ఉంచాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ వైస్గ్రాడ్ ఫండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించడమే ఈ గ్రూప్ లక్ష్యం.
డికాప్రియో ఇంత భారీ విరాళం అందించడానికి వ్యక్తిగత కారణమూ ఉంది. ఆయన అమ్మమ్మ హెలెని ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలోనే జన్మించారు. 1917లో ఆమె తల్లిదండ్రులతో కలిసి జర్మనీకి వలస వెళ్లారు. అక్కడే డికాప్రియో తల్లి జన్మించారు. ఆయనకు అమ్మమ్మతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి డికాప్రియోకు అమ్మమ్మ మద్దతుగా ఉన్నారు. డికాప్రియో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్‌కు ఆమె కూతురితో కలిసి వెళ్లారు. 2008లో 93 ఏళ్ల వయసులో హెలెని మరణించారు.
లియోనార్డో డికాప్రియో ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రివనాంట్ సినిమాలో నటనకు గానూ 2016లో ఆస్కార్ అందుకున్నారు. చాలా ఏళ్లుగా 'యాక్టర్ అండ్ ఎకాలజిస్ట్' అనే వ్యాసాన్ని కూడా రచిస్తున్నారు. వాతావరణ విపత్తుపై పోరాటంలో క్రియాశీలకంగా ఉన్నారు. 25 ఏళ్ల వయసులోనే 1998లో కుటుంబ సభ్యులతో కలిసి 'లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్'ను కూడా స్థాపించారు.
ఇదీ చదవండి: Alia Bhatt: ఆలియా హాలీవుడ్ ఎంట్రీ.. ఈ సినిమాతోనే..