బాలీవుడ్లో బంధుప్రీతి ఎక్కువైందని విమర్శించిన సీనియర్ దర్శకుడు శేఖర్ కపూర్.. గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆయన తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం 'ఎలిజబెత్'లో ఏ విధంగా కేట్ బ్లాంచెట్ను ఎన్నుకున్నారో చెప్పారు. వెండితెరకు పరిచయం లేని కొత్త నటితో ఈ సినిమా రూపొందించారు. 1998లో విడుదలైన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది.
"ఎలిజబెత్ నా తొలి హాలీవుడ్ చిత్రం. సినిమాల్లో ఎప్పుడూ కనిపించని కేట్ బ్లాంచెట్ను ఎలిజబెత్ పాత్రకు ఎంచుకున్నాను. అయితే స్టూడియో మాత్రం పేరొందిన నటినే పెట్టాలని అన్నారు. లేదంటే నన్ను దర్శకత్వ బాధ్యతల నుంచి తొలగిస్తామని అన్నారు. నా మనసుకు నచ్చిందే చేస్తా అని వారికి క్లారిటీ ఇచ్చా. ఆ తర్వాత ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది" అని కపూర్ వెల్లడించారు.
ఎలిజబెత్ సినిమా తర్వాత బ్లాంచెట్ గ్లోబల్ ఫేం సంపాదించుకుంది. బాఫ్టా అవార్డుతో పాటు ఉత్తమ నటి కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కొత్త వారికి అవకాశాలు రావట్లేదని, నెపోటిజం నడుస్తోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.