అమితాబ్ బచ్చన్.. కమల్ హాసన్.. షారుక్ ఖాన్.. అక్షయ్ కుమార్.. ప్రియాంకా చోప్రా.. వీరంతా నేడు చిత్ర పరిశ్రమను ఏలుతున్న అగ్ర తారలు. కోట్లాది ప్రజల మన్ననలు పొందిన నటీనటులు. ఓ సినిమాలో నటిస్తే రూ.కోట్ల పారితోషికం ఇస్తుంటారు. వీరి డేట్స్ కోసం వరుసకట్టే దర్శక, నిర్మాతలు ఎందరో. ఆర్జనలోనూ, పేరు ప్రఖ్యాతల్లోనూ వీరిప్పుడూ ముందుకు దూసుకెళ్తున్నారు. నేడు అగ్ర స్థానంలో ఉన్న వీరు ఒకప్పుడు ఎలా ఉండేవారు. స్టార్‌డమ్‌కు ముందు వారి పరిస్థితి ఏంటి? ఆరంభంలోనే వీరి కెరీర్ పూలబాటగా మారిందా..? కానేకాదు.. అవమానాలు, కష్టాలు ఎదుర్కొని పట్టుదలతో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అలాంటి వారిలో కొందరు స్టార్స్ మొదటి జీతం ఎంతో చూద్దామా..!
'నువ్వు సినిమాలకు పనికిరావు?' అని అమితాబ్‌ను చాలా మంది దర్శక, నిర్మాతలు తిరస్కరించారు. ఇప్పుడు ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.2800 కోట్లని సమాచారం (2019 ఆగస్టు నాటికి). భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. విపత్తు సమయాల్లో సాయం చేయడానికి అమితాబ్ చేయి ఎప్పుడూ ముందుంటుంది. కరోనా సమయంలోనూ తనవంతుగా విరాళాలు అందించారు. కాగా అమితాబ్ తొలి జీతం నెలకు రూ.500. ఆయన సినిమాల కోసం ముంబయికి రావడానికి ముందు ఓ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.
విలక్షణ నటుడిగా దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ నటిస్తున్న స్టార్ కమల్ హాసన్. 1960లో ఆయన బాలనటుడిగా అరంగేట్రం చేశారు. 'కాలాతూర్ కన్నమ్మ' సినిమాలో ఆయన మహానటి సావిత్రి కుమారుడిగా నటించారు. ఇందులో నటనకుగానూ ఆయనకు రూ.500 పారితోషికం ఇచ్చారు. ఆపై అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన హీరోగా మారారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో దాదాపు 220 సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.700 కోట్లని సమాచారం.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కెరీర్ పరంగా ఎంత విజయవంతంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్నాయి. కొవిడ్ సంక్షోభంలో ప్రధాని సహాయ నిధికి ఏకంగా రూ.25 కోట్లు అందించారు. 2019 అక్టోబరు ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న నటుల్లో అక్షయ్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.500 కోట్లు. అక్షయ్ తన నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్ని కూడా తీస్తున్నారు. అనేక ఉత్పత్తులకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తున్నారు. ఒక్కో సినిమాకు బడ్జెట్‌ను బట్టి ఆయన రూ.40 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారట. చిత్ర పరిశ్రమలోకి రాకముందు అక్షయ్ బ్యాంకాక్‌లోని హోటల్‌లో వెయిటర్‌గా, చెఫ్‌గా పనిచేశారు. ఆయన మొదటి జీతం రూ.1500.
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఆమె తల్లిదండ్రులు ఆర్మీలో పనిచేశారు. దీంతో ప్రియాంక బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. 13 ఏళ్ల వయసులో ఆమె చదువుల కోసం అమెరికాలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే థియేటర్ ప్రొడక్షన్స్‌లో పనిచేశారు. క్లాసిక్ మ్యూజిక్‌లో శిక్షణ పొందారు. అమెరికాలోని క్లాస్‌మేట్స్ తనను ఏడిపించేవారని, తన శరీర రంగును హేళన చేసేవారని ఆమె ఓ సందర్భంలో అన్నారు. ఇలాంటి అవమానాలు ఎదుర్కొని.. అందాల పోటీల్లో పాల్గొన్నారు. 2000లో ప్రపంచ సుందరిగా కిరీటం సొంతం చేసుకున్న తర్వాత వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ప్రియాంక తన మొదటి ప్రొఫెషనల్ అసైన్మెంట్‌తో రూ.5 వేలు సంపాదించారు. ఈ మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. ఇటీవల ఆమె లాస్‌ఏంజెల్స్‌లో రూ.145 కోట్ల విలువైన ఇల్లు కొన్నారు. 2020 లెక్కల ప్రకారం ప్రియాంక ఆస్తి విలువ రూ.150 కోట్లని తెలిసింది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గత 25 ఏళ్లుగా ప్రేక్షకుల ఎనలేని ఆదరణ పొందుతున్నారు. చిత్ర పరిశ్రమలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఆయన ఒకరు. ఆయన తన మొదటి అసైన్మెంట్‌కు రూ.50 జీతంగా తీసుకున్నారు. తన తొలి సంపాదనతో అప్పట్లో దిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్ చూశారు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకరు.
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 'క్రిష్' సినిమాతో ఆయన దక్షిణాది ప్రజలకూ దగ్గరయ్యారు. హృతిక్ ఆరేళ్ల వయసులో 'ఆశా' సినిమాలో బాల నటుడిగా కనిపించారు. 1980లో వచ్చిన ఈ చిత్రంలో నటించినందుకు హృతిక్‌కు రూ.100 జీతంగా ఇచ్చారట. ఆపై పలు చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన ఆయన 2000లో 'కహోనా ప్యార్ హై'తో హీరోగా అరంగేట్రం చేశారు. యువత హృదయాల్ని దోచి.. అనేక హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 2020 లెక్కల ప్రకారం హృతిక్ ఆస్తి విలువ రూ.270 కోట్లని సమాచారం.
అగ్ర నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సోనమ్ కపూర్. అనిల్‌ది ధనవంతుల కుటుంబం అయినప్పటికీ పిల్లల్ని అలా పెంచలేదు. స్వతహాగా వారు ఎదగాలని భావించారు. ఈ కోవలోనే సోనమ్ 18 ఏళ్ల వయసులో సహాయ దర్శకురాలిగా పనిచేశారు. దీనికి గానూ రూ.3000 జీతం పొందారు. ఆపై కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆమె ఆస్తి విలువ రూ.110 కోట్లని సమాచారం.
ప్రముఖ నటుడు ధర్మేంద్ర తన నటనతో ఒకప్పుడు ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నారు. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్నారు. కాగా 1960లో 'దిల్ బీ తేరా హమ్ బీ తేరా' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. అప్పట్లో ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు రూ.51 పారితోషికంగా ఇచ్చారట.
అద్భుతమైన కథా చిత్రాలతో అలరించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని లోటు. ఆయన మొదటి జీతం రూ.25. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో పొట్టకూటి కోసం చిన్న చిన్న పనులు చేసేవారు. ఇప్పుడు ఆయన ఆస్తి విలువ 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.376 కోట్లు) అని సమాచారం.
ఇదీ చూడండి... మహేశ్ మెడపై రూపాయి పచ్చబొట్టుకు ఇంత కథ ఉందా?