ఓటీటీలు, సినిమా థియేటర్ల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సామర్థ్యంతో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. కాగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు మాత్రం నిరాకరిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఇతర సినిమా ప్రముఖులతో కలిసి బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
అక్టోబర్ వరకు ఆగండి
థియేటర్లు మూసి ఉన్నాయనే సాకు చూపి నిర్మాతలు పెద్ద సినిమాలకు ఓటీటీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల థియేటర్ వ్యవస్థ సమూలంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీలకు తాము వ్యతిరేకం కాదని.. అక్టోబర్ వరకు నిర్మాతలు తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని పలువురు ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయంలో సమావేశమైన ఎగ్జిబిటర్లు... ఓటీటీల వల్ల కలుగుతున్న నష్టాలను వివరించారు. థియేటర్లపై ఆధారపడి కోటిశ్వరులైన నిర్మాతలు... ఇప్పుడు థియేటర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడవడం మంచిది కాదని వాపోయారు. ఓటీటీల్లో సినిమాల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
థియేటర్లను బతికించండి
ఓటీటీ నుంచి సినిమా థియేటర్లను బతికించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేశారు. ఓటీటీలో సినిమా విడుదల ఆపే వరకూ హాళ్లు తెరవబోమని స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలుగు సినిమా నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు ఈ ఏడాది అక్టోబరు వరకూ వేచి చూడాలని ఇటీవల జరిగిన ఓ సమవేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని చెప్పింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది.
విడుదలపై నిర్మాతలు పునరాలోచనలు
ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి వచ్చినా కొత్త సినిమాల విడుదలపై నిర్మాతలు పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఓటీటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. పైగా గతంలోనూ వకీల్‌సాబ్ విడుదల చేసినా.. నిర్మాతలు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోయారు. సినిమా విడుదలైన నాలుగు రోజులకే కరోనా రెండోదశ ముప్పు రావడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు మూడో ముప్పు రాబోతుందన్న ఊహాగానాలు నిర్మాతలను మళ్లీ ఆలోచనలో పడేశాయి. థియేటర్లు తెరిచినా.. రెండు వారాల తర్వాతే కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఇవీ చూడండి:
Producer SKN: థియేటర్లు లేకపోతే స్టార్డమ్ ఉండదు!
THEATRES OPEN: తెలంగాణలో థియేటర్లు రీ-ఓపెన్.. ఎప్పుడంటే..?