లాక్డౌన్(Lockdown) మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తూ, వారి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్(sonusood). ఆయనతో ఈటీవీ భారత్(ETV BHARAT) ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తాను చేయబోయే విషయాల గురించి వెల్లడించారు.
ఈటీవీ భారత్: కరోనా రాకముందు వరకు మీరు కేవలం సోనూసూద్. కానీ ఇప్పుడు మేసాయ్, సూపర్‌మ్యాన్ ఇతరత్రా పేర్లతో పిలుస్తున్నారు. ఇంతకీ మీరు ఎలా ఫీలవుతున్నారు?
సోనూసూద్: నేను చాలా సాధారణమైన వ్యక్తిని. ప్రజలతో మమేకమైనప్పుడు మన రియాలిటీని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్లు మనల్ని ఏ పేరుతో అయినా పిలవొచ్చు. మమ్మల్ని ఎప్పుడైతే గౌరవిస్తారో, అదే జీవితంలో లభించే గొప్ప అచీవ్మెంట్.
ఈటీవీ భారత్: ప్రజలు అడిగిన వాటిని తీర్చుతుండటం వల్ల మీపై వాళ్లు నమ్మకం పెంచుకున్నారు. మీ తర్వాత ప్లాన్ ఏంటి?
సోనూ: ప్రజలకు సహాయం ఎప్పుడూ అవసరమే. కరోనా కష్టకాలంలో వాళ్ల సమస్యలు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు కాలినడకన తమ ఇళ్లకు ప్రయాణమయ్యారు. వాళ్లకు సాయం చేసే చేతులు నావి ఎందుకు కాకుడదని భావించాను. ఈ మంచిపనిలో నాకు తోడుగా దేశం మొత్తం భాగమైంది. కానీ అది ఎప్పుడు జరిగిందో నాకైతే తెలియదు. 10 లక్షలమంది భద్రంగా ఇళ్లకు చేరుకున్నారు. చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించాను.
ఈటీవీ భారత్: ప్రస్తుత పరిస్థితుల్లో దేశం పరిస్థితి ఒకలా ఉంటే, సోనూసూద్‌కు మాత్రం సహాయం చేసేందుకు నిధులు వస్తూనే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం?
సోనూ: సొంతదారిని నేనే నిర్మించుకున్నాను. నాకన్న ఎక్కువ వనరులు, ఆర్ధికంగా బలమైన వ్యక్తులు ఉన్నారు. ఈ విషయంలో నాకు నేను పరిమితులు విధించాలని అనుకోవట్లేదు.
ఈటీవీ భారత్: ఇవన్నీ చేస్తున్నారు కదా. మీరు రాజకీయాల్లోకి వస్తారా?
సోనూ: రాజకీయాలు అద్భుతమైన రంగం. కానీ ప్రజలకు దానిపై చెడు అభిప్రాయం ఏర్పడింది. నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు. నటుడిగా ఇంకా చాలా పాత్రలు చేయాల్సి ఉంది. పొలిటిక్స్‌కు రానని చెప్పను. అలా అని సిద్ధంగానూ లేను. ఇప్పటికీ ప్రజలకు సాయం చేస్తున్నాను. రాజకీయ నాయకుడిగా మారేందుకు చాలా ప్రిపరేషన్ కావాలి. ఒకవేళ అది భవిష్యత్తులో జరిగొచ్చేమో!