'కొత్తబంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత తీసిన 'బ్రహ్మోత్సవం' సినిమా ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఒక్క చిత్ర ఫలితంతో వరుస విజయలందుకున్న శ్రీకాంత్.. మళ్లీ సినిమా చేజిక్కించుకోవడానికి మూడేళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం 'అసురన్' తెలుగు రీమేక్‌కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
తాజాగా ఈ సినిమాకు శ్రీకాంత్ అందుకోబోతున్న పారితోషికానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీని తెరకెక్కించేందుకు శ్రీకాంత్‌కు నెలకు రూ.2 నుంచి 3 లక్షల మధ్య పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర మాతృకను దర్శకుడు వెట్రి మారన్ కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాడు. తెలుగు వర్షెన్ కూడా ఇంచుమించు ఇదే వేగంతో పూర్తి చేయాలని నిర్మాత సురేష్‌బాబు నిర్దేశించాడట. ఇదంతా చూస్తుంటే దర్శకుడిగా శ్రీకాంత్‌కు కేవలం రూ.10 లక్షల్లోపే పారితోషికం ముట్టబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాత మంచి ఫలితం వస్తే.. లాభాల్లో ఆయనకి ఎంతో కొంత వాటా ఇస్తానని సురేష్ ప్రొడక్షన్స్ మాటిచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ఒక్క సినిమాతో శ్రీకాంత్.. కోట్ల పారితోషికం లక్షల్లోకి పడిపోయిందనేది తెలుస్తోంది.
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?