మూడు నెలల తర్వాత షూటింగ్‌కు వెళ్లడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా మార్చిలో చిత్రీకరణలు ఆగిపోయాయి. చిత్రీకరణలు మొదలుపెట్టేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో జులై 15 నుంచి, తెలంగాణలో మాత్రం జూన్ 15 తర్వాత షూటింగ్‌లు జరుపుకోవచ్చు.
ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణలో దిగిన పాత ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు రాజమౌళి. అందులో విజువల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్‌లతో జక్కన్న ఏదో చర్చిస్తున్నట్లు ఉంది. "సెట్స్ పైకి రాకుండా ఇప్పటికే మూడు నెలలు దాటిపోయింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరిగి వచ్చేందుకు ఆత్రుతగా ఉన్నాం" అంటూ పేర్కొన్నారు.
ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత కల్పిత కథ ఇది. బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, అలియా భట్లు కీలకపాత్రలను పోషిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన ఒలీవియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి... కుటుంబంతో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు