"దర్శకత్వమైనా.. నిర్మాణమైనా.. ఓ సినిమా చేస్తున్నామంటే కచ్చితంగా దానికొక మంచి లక్ష్యం ఉండాలి. పదిరూపాయలు పెట్టాం.. పదిహేను రూపాయలు వస్తుందన్నట్లు చూడకూడదు. పదేళ్ల తర్వాత ఓ తెలియని వ్యక్తి సినిమా చూసినా 'భలే తీశారే' అన్నట్లుండాలి. చిత్రం తీసిన వాళ్లు, అందులో చేసిన వాళ్ల పట్ల ఓ గౌరవ భావం కలగాలి. నా సినిమా లెప్పుడూ అలా ఉండాలనే అనుకుంటా" అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడాయన నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం 'జాతిరత్నాలు'. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అనుదీప్ దర్శకుడు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నాగ్ అశ్విన్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
* నాకు మొదటి నుంచీ జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణారెడ్డిల చిత్రాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా నేనూ అలాంటి పూర్తి వినోదాత్మక చిత్రం చేయాలనుకునే వాడ్ని. ఈ క్రమంలోనే దర్శకుడు అనుదీప్ తీసిన ఓ లఘు చిత్రం చూశా. అందులోని సున్నితమైన వినోదం.. నాకు బాగా నచ్చాయి. అప్పుడే తనతో ఓ మంచి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. అయితే అప్పటికి నేనింకా దర్శకుడ్ని కాలేదు. తర్వాత 'మహానటి' సమయంలో తనని పిలిచి.. ఏమన్నా కథలుంటే చెప్పు సినిమా చేద్దామని అడిగా. అలా నేనే తన వెంటపడి ఈ చిత్రం చేశా.
తొలుత వేరే టైటిల్స్ అనుకున్నాం
అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' అలాంటి చిత్రమే. ముగ్గురు సిల్లీఫెలోస్.. ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే.. దీనికి నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సరిగ్గా సరిపోతారనిపించింది. నిజానికి నవీన్‌ను నేనే హీరోగా పరిచయం చేయాల్సింది. నా తొలి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'ను విజయ్, నవీన్‌లతోనే చిన్న బడ్జెట్‌లోనే తీద్దామనుకున్నా. నాని రాకతో ఆ చిన్న చిత్రం.. పెద్దగా మారిపోయింది. నవీన్‌కు ఈ కథ వినిపించే సమయానికి తను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తొలి షెడ్యూల్ కోసం వెళ్లే పనిలో ఉన్నాడు. దీంతో ఆ సినిమా పూర్తయ్యే దాక మేము ఆగాల్సి వచ్చింది. ఆ చిత్రంతో నవీన్‌కి మంచి బ్రేక్ రావడంతో.. ఇప్పుడది మాకు కలిసొచ్చినట్లయింది.ఈ చిత్రానికి తొలుత ‘ఆణిముత్యాలు’, ‘సుద్దపూసలు’ అని కొన్ని టైటిల్స్ అనుకున్నాం. వీటిలో ‘జాతిరత్నాలు’ అన్నది క్యాచీగా.. మార్కెటింగ్ పరంగా బాగుంది అనిపించడం వల్ల ఆ పేరునే ఖరారు చేశాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
క్లిష్టమైన వ్యవహారమే
ఒక సినిమా దర్శకత్వం చేయడానికీ.. నిర్మాతగా ఉండటానికి పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే రెండు బాధ్యతల్లోనూ దాదాపు ఒకేరకమైన కష్టముంటుంది. ఓ దర్శకుడు.. నిర్మాతగా ఉండటమన్నది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. సాధ్యమైనంత వరకు దర్శకుడి సొంత ఫ్లేవర్ ఎక్కడా తగ్గకుండా.. సృజనాత్మకంగా, సాంకేతికంగా ఎక్కడా లోటుపాట్లు లేకుండా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడూ ‘ఈ షాట్ ఇలా తీయొచ్చేమో చూడ’ని సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ‘మీరు ఇంటికి ఎప్పుడెళ్తారు సర్’ అని అనుదీప్ అడిగేవాడు (నవ్వుతూ)’’.
కొత్త ప్రపంచం సృష్టిస్తున్నాం
ప్రభాస్ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచిస్తుందనైతే చెప్పగలను. ఈ చిత్ర స్క్రిప్ట్, దీని కోసం సృష్టించే ప్రపంచం అంత కొత్తగా ఉండనున్నాయి. ‘మహానటి’ చిత్రంలో ఉపయోగించిన కార్లు లాంటివి కావాలంటే.. ఎక్కడి నుంచైనా అద్దెకు తీసుకురావొచ్చు. కానీ, ఈ సినిమాకి కావాల్సిన వాహనాలు ఇప్పుడెక్కడా లేవు. కచ్చితంగా తయారుచేయించుకోవాల్సిందే. ఇందులో ఉపయోగించే చిన్న వస్తువు నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా తయారు చేయించుకోవాల్సిందే. జులై నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం.