'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రం', 'భలేభలే మగాడివోయ్' సినిమాలతో భావోద్వేగాలను పండిచడమే కాకుండా ప్రతిఒక్కరిని కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు మారుతి. తాజాగా ఈ డైరక్టర్ తెరకెక్కించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. సాయితేజ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మారుతి హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు. ఆ విశేషాలివే..
చాలామంది ఫోన్స్..
'ప్రతిరోజూ పండగే' సినిమా చూసిన తర్వాత ఎంతో మంది నాకు ఫోన్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితోపాటు సామాన్య ప్రేక్షకులు కూడా నాకు ఫోన్ చేసి సినిమా చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు. నిజం చెప్పాలంటే 'భలే భలే మగాడివోయ్' తర్వాత అన్ని కాల్స్ వచ్చింది ఈ సినిమాకే.
చిరు ప్రశంస
చిరంజీవి గారు ప్రివ్యూ చూశారు. సినిమాను చాలా అందంగా, అద్భుతంగా తెరకెక్కించానని ప్రశంసించారు. చిత్రబృందం మొత్తానికి ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అలాగే ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవుతుందన్నారు. రాఘవేంద్రరావు గారు కూడా మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మారుతీ సినిమా బాగా చేశావు. ప్రతిరోజూ పండగే చాలా రిస్క్ పాయింట్‌తో కూడుకున్న కథ. కానీ నువ్వు దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలా అద్భుతంగా తెరకెక్కించావన్నారు.
ఈ సినిమా చేయడానికి కారణమదే..
'ప్రతిరోజూ పండగే' చిత్రంలో చూపించినట్టే నిజజీవితంలో కొన్ని సంఘటనలను చూశాను. విదేశాల్లో ఉండే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉన్నాసరే చూడడానికి రారు. బిజీ లైఫ్‌లో రావడం కుదరడం లేదు అని చెబుతారు. అలాంటి వారందరికీ తల్లిదండ్రులకు జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మమని ఈ సినిమాలో చెప్పాలనుకున్నా. ఈ మూవీ అనుకున్నప్పుడు చాలా మందికి కథ చెప్పాను. అందరికీ ఈ కథ బాగా నచ్చింది. అలా 65 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం.
రావురమేష్ పాత్ర..
ఈ సినిమా అనుకున్నప్పుడు హీరో తండ్రి పాత్రకు రావురమేష్‌నే అనుకున్నాను. అదే విషయం ఆయనకు చెబితే.. "సార్ చాలా పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నారు. హీరోకి ఓకేనా" అని అడిగారు. అందరికీ ఓకే అండి అని చెప్పాను. ఈ సినిమాలో రావు రమేష్ పాత్రను 28 రోజులపాటు చిత్రీకరించాం. ఆయనతో కలిసి పనిచేయడం ఓ పండగలా ఉంటుంది. నేను ఎప్పుడూ ఏ క్యారెక్టర్‌కు డైలాగులు పూర్తిగా అనుకోను. సెట్‌లోకి వెళ్లాక డైలాగులు వాటికవే వచ్చేస్తాయి.
'శతమానం భవతి 2' అవుతుందన్నారు
నేను మొదట ఈ కథను దిల్‌రాజుకు చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. అప్పటికే ఆయన 'శతమానం భవతి' సినిమా చేశారు. ఒకవేళ ఈ కథను తెరకెక్కిస్తే 'శతమానం భవతి 2' అవుతుందంటారు అని చెప్పారు.’ అందుకే ఆయన ఈ సినిమా చేయలేదు.
టిక్‌టాక్‌లకు బానిసలవుతున్నారు
టిక్‌టాక్ వీడియోలను రోజూ చూస్తున్నాను. ప్రతిఒక్కరూ మేము నాలుగు గోడల మధ్య చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ప్రపంచం మొత్తం వాళ్లను చూస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. కొన్నిసార్లు వాళ్ల డ్యాన్సులేంటో కూడా అర్థం కావు. ప్రతిఒక్కరూ టిక్‌టాక్ బానిసలవుతున్నారు. అదే సినిమాలో హీరోయిన్ పాత్రతో చూపించాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
త్వరలో వెబ్ సిరీస్..
తెలుగువారు వెబ్‌సిరీస్‌ను తక్కువగా చూస్తున్నారు. కానీ మన భవిష్యత్తు అదే. నేను కూడా భవిష్యత్తులో వెబ్‌సిరీస్ చేస్తాను. ఇప్పటికే నన్ను 'లస్ట్ స్టోరీస్' తెరకెక్కించమని కొందరు సంప్రదించారు. 'ప్రతిరోజూ పండగే' తర్వాత ఏ సినిమా తెరకెక్కించాలని ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఓ మంచి ప్రేమ కథను తెరకెక్కించాలనుకుంటున్నా. అది కూడా పూర్తి హాస్యభరితంగా ఉండేలా చూడాలనుకుంటున్నా.
ఇవీ చూడండి.. పండగ సెట్లో నవ్వులే నవ్వులు.. మీరూ చూసేయండి