పుంజుకుందనుకున్న తెలుగు చిత్రసీమ.. మరోసారి కరోనా దెబ్బకు విలవిలాడుతోంది. మొన్నటిదాకా ఆశలు రేకెత్తిస్తూ... నిండుగా సందడిగా కనిపించిన థియేటర్.. ఇప్పుడు ప్రేక్షకులు లేక, కొత్త సినిమాలు రాక వెలవెలబోతోంది. దాంతో ప్రదర్శనకారులు హాళ్లు మూసేయాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వాల ఆదేశాల తర్వాతే పూర్తిగా మూతబడ్డాయి సినిమా హాళ్లు. ఇప్పుడు అలాంటి ఆదేశాలేవీ లేకపోయినా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాయి యాజమాన్యాలు. తెలంగాణలో 'వకీల్‌సాబ్' ప్రదర్శితం అవుతున్న థియేటర్లు మినహా మిగిలిన వాటిలో మే 1వరకు ప్రదర్శనలు నిలిపివేయాలని ఆ రాష్ట్ర ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు సాగుతున్నాయి.
తెలంగాణలో దాదాపు 650కిపైగా, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 1000 థియేటర్లున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది లాక్‌డౌన్ దెబ్బకు థియేటర్లు మూతపడటం వల్ల కార్మికులు, వ్యాపారులు చాలా కష్టాల్ని ఎదుర్కొన్నారు. ఆ గాయాలు మానకముందే మరోసారి కరోనా విజృంభించింది. థియేటర్లపై ప్రభావం చూపిస్తోంది. కొన్నాళ్లుగా కరోనా భయాలతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. థియేటర్ నిర్వహణ ఖర్చులూ తిరిగి రాని పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త సినిమాల విడుదలలూ ఆగిపోయాయి. అందుకే థియేటర్లను కొన్నాళ్లపాటు మూసేయాలని నిర్ణయం తీసుకున్నాయి యాజమాన్యాలు. తెలంగాణలో బుధవారం నుంచి 95 శాతం థియేటర్లు మూతపడనున్నాయి. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కీలకమే కాబట్టి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి నిర్ణయమే వెలువడొచ్చంటున్నాయి సినీవర్గాలు. ఆ రాష్ట్ర ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, థియేటర్ యాజమాన్యాలతో చర్చలు కొనసాగిస్తోంది.
ఈ వేసవీ దక్కనట్టేనా?
తెలుగు సినిమాకు సంక్రాంతి, వేసవి సీజన్లు అత్యంత కీలకం. ప్రేక్షకులు కుటుంబాలతో కదిలి థియేటర్లకు వచ్చేది ఈ సీజన్లలోనే. అందుకే రికార్డు స్థాయిలో వసూళ్లు లభిస్తుంటాయి. రూ. వందల కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. అగ్ర కథానాయకుల చిత్రాలు థియేటర్ల ముందుకు వరుస కడుతుంటాయి. అలాంటి కీలకమైన వేసవి సీజన్.. కరోనా పుణ్యమా అని రెండోసారీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఈసారి వేసవిపై పరిశ్రమ చాలా ఆశలతో కనిపించింది. ‘వకీల్‌సాబ్’ తర్వాత థియేటర్ల దగ్గర అసలు సిసలు హంగామా మొదలవుతుందని, గతేడాది వేసవి లేని లోటుని తీర్చేలా సినీ వినోదాన్ని తెలుగు ప్రేక్షకులు ఆస్వాదిస్తారని ఊహించారంతా! అందుకే చిత్రీకరణల్లో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నా.. వాటిని అధిగమిస్తూ వేసవి కోసం సినిమాలు ముస్తాబు చేశారు. కానీ కరోనా ఉద్ధృతితో ‘వకీల్‌సాబ్’ తర్వాత రావల్సిన కీలకమైన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ సినిమాలే కాదు... మే నెలలో రావల్సినవి అనుమానమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది సినీ వేసవి లేనట్టే.
78 సినిమాలతో మురిపించి..
గతేడాది కరోనా ప్రభావం తర్వాత ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమా కోలుకోలేదు. ఉత్తరాదిలో అయితే ఇప్పటికీ తెరుచుకోని థియేటర్లు చాలానే. కానీ తెలుగు చిత్రసీమ చాలా వేగంగా పుంజుకుంది. 2020 డిసెంబరులో విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ నెల 16వ తేదీ విడుదలైనవాటిని కలుపుకొంటే ఈ యేడాదిలోనే 76 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో పదికిపైగా సినిమాలు లాభాల్ని సొంతం చేసుకున్నాయి. ఆ ఉత్సాహంతో చిత్రీకరణల్లోనూ వేగం పెరిగింది. కథానాయకులు ఒకొక్కరు రెండు మూడు సినిమాతో బిజీ బిజీగా గడిపారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ వేసవితో చిత్రసీమ పూర్తిగా దారిలో పడేది. అమెరికా వరకు తెలుగు సినిమాల విజృంభణ చూసి ఇతర చిత్ర పరిశ్రమలూ అబ్బురపడ్డాయి. కానీ రెండో దశ కరోనాతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టయింది.
చిత్రీకరణలపైనా..
థియేటర్లలో సినిమాల ప్రదర్శనలపైనే కాదు.. చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించారు. తప్పనిసరి అనుకుంటే 50 మంది కార్మికులతోనే చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాలు జరపాలని నిర్మాతల మండలి ఆదేశించింది. అవసరమైన మార్గదర్శకాల్ని పాటించాలని కోరింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి. సినిమాల చిత్రీకరణ అంటే వందల మంది కలిసి పనిచేయాల్సిందే. పైగా పలు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య షూటింగ్‌లు అసాధ్యమే. పలువురు ఇప్పటికే తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు.
విడుదల వాయిదా
ఈ నెల 23న విడుదల కావల్సిన ‘ఇష్క్’, ‘తెలంగాణ దేవుడు’ చిత్రాలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల, ప్రేక్షకుల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని సినిమాల విడుదలని నిలిపేసినట్టు ఆ చిత్ర నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. తదుపరి విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఇరవై మందీ కరవయ్యారు
* ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన రోజు నుంచే సినిమాలకు వసూళ్లు పడిపోయాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. ఒకొక్క షోలో 15 నుంచి 20 మందే కనిపిస్తున్నారు. ఆ వసూళ్లు కరెంటు బిల్లులకీ సరిపోవు. అటు సింగిల్ థియేటర్లు, ఇటు మల్టీప్లెక్సులు రెండో చోట్లా అదే పరిస్థితి. అందుకే కొత్త సినిమాల విడుదలల్ని ఆపేశారు. చిన్న సినిమాలు కూడా విడుదల కావడం లేదు. ఆ కారణంతోనే కొన్నాళ్లపాటు థియేటర్లు బంద్ చేయాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాం. మే 1 తర్వాత పరిస్థితులు, ప్రభుత్వాల ఆదేశాల్ని గమనించి మేం తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణలో ‘వకీల్‌సాబ్’ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లు మినహా మిగిలిన 95 శాతం హాళ్లు బుధవారం నుంచి బంద్ అవుతున్నాయి.
- విజేందర్‌రెడ్డి, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.
అవీ వాయిదా పడటం వల్ల..
* కొన్ని రోజులుగా కరోనా భయాలతో వసూళ్లు బాగా తగ్గిపోయాయి. 80 శాతం ప్రేక్షకులతో కనిపించాల్సిన హాళ్లు 40 శాతమూ నిండడం లేదు. దీనిపైనే మేం చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లంతా సమావేశం అయ్యాం. చిన్న సినిమాల కోసం కొన్ని థియేటర్లు తెరిచి ఉంటే తప్పేం లేదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఆ చిత్రాలూ వాయిదా పడటంతో ‘వకీల్‌సాబ్’ ఆడుతున్న థియేటర్లు మినహా మిగిలినవాటిని బంద్ చేయాలని నిర్ణయించాం.
- బాలగోవిందరాజు, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి జాయింట్ సెక్రటరీ