బాలీవుడ్లో స్వయంగా జీవితచరిత్రలను రాసుకునే ట్రెండ్ మొదలైంది. ఇటీవలే ప్రియాంకా చోప్రా తన జీవితంలోని కొన్ని సంఘటనలతో 'అన్ఫినిష్డ్' పేరిట ఓ పుస్తకాన్ని ముద్రిస్తున్నట్లు చెప్పింది. తాజాగా సైఫ్ అలీఖాన్ ఇదే జాబితాలో చేరారు. తన ఆటో బయోగ్రఫీని రాయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తన వ్యక్తిగత జీవితం సహా సినిమా విశేషాలు, కెరీర్లోని ఎత్తుపల్లాలు, స్ఫూర్తి నింపిన వ్యక్తుల గురించి ఇందులో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. హార్పర్ కోలిన్స్ సంస్థ ప్రచురించనున్న ఈ పుస్తకం.. 2021లో విడుదల కానుంది.
ఆదిపురుష్లో ప్రభాస్ ప్రత్యర్థిగా...
టాలీవుడ్ హీరో ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. ఈ విషయమై జోరుగా చర్చ జరుగుతోంది. చెడుపై మంచిదే విజయం అనే కథతో దర్శకుడు 'ఓం రౌత్' ఈ సినిమా తీస్తున్నారు. అయితే 'ఓం రౌత్' తెరకెక్కించిన 'తాన్హాజీ'లో సైఫ్ కీలక పాత్రలో కనిపించారు. అందుకే ఈ ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి.
ఈ సినిమాను నేరుగా తెలుగు, హిందీలో తెరకెక్కించి ఆపై తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేయనున్నారు. భూషణ్ కుమార్ సమర్పణలో గుల్షన్ కుమార్, టీ-సిరీస్ పతాకంపై.. కిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.