లాక్డౌన్ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. సమయాన్ని గడపడానికి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్ ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. తన పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపింది.
నెటిజన్: మీరు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ ప్రయాణం ఏం నేర్పింది?
శ్రద్ధా కపూర్: పదేళ్ల ప్రయాణం చాలా నేర్పించింది. శక్తి కపూర్ కూతురుగా కెరీర్ ప్రారంభించినా నా మార్కు కోసం చాలా కష్టపడ్డా. హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే నాకు ఎక్కువ పాఠాలు నేర్పాయి. కథల ఎంపిక మొదలు నటన వరకు ప్రతి విషయంలోనూ నన్ను నేను మార్చుకుంటూ వచ్చా. నాన్న ఎన్నో సలహాలు ఇస్తుండేవారు. ఆయన హిందీతో పాటు దక్షిణాదిలోనూ నటించారు. నాక్కూడా ఒక్క భాషకే పరిమితం కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లో నటించమని చెప్పేవారు. 'సాహో' రూపంలో ఆ అవకాశం దక్కింది. దక్షిణాదికి దగ్గర కాగలిగాను. ప్రత్యేకంగా ఇలాంటి కథల్లోనే నటించాలి, ఈ తరహా పాత్రలైతేనే నాకు సరిపోతాయి అంటూ హద్దులు పెట్టుకోను. కొత్తగా ఉండాలంతే. అది ఏ భాషైనా నటించేస్తా. నా వయసుకు మించిన పాత్రైనా, తక్కువ వయసున్న పాత్రైనా, డీగ్లామర్ పాత్రైనా.. దేనికైనా సిద్ధమే. అందుకే నా వద్దకు అన్ని రకాల కథలతోనూ వస్తున్నారు దర్శకులు. శ్రద్ధ అన్ని పాత్రలు చేయగలదు అనే మాట ఎంతో సంతృప్తిగా ఉంటుంది.
ఇదీ చూడండి.. కరోనాను లెక్కచేయని నాని- మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్