బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'అంధాధున్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. నితిన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే మాతృకలో టబు పోషించిన పాత్ర కోసం అనసూయ, టబు, రమ్యకృష్ణ పేర్లు పరిశీలనకు వచ్చాయి. కానీ ఎవరినీ చిత్రబృందం ఖరారు చేయలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.
హిందీలో హీరో ఆయుష్మాన్‌తో పాటు టబుది సవాల్ విసిరే పాత్ర. మరి ఇలాంటి రోల్‌ను తెలుగులో ఎవరు చేస్తారా? అని చాలా కాలంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం భూమికను ఎంపిక చేసినట్లు టాక్. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనుండగా, శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది.