లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి(Anushka Shetty) సోషల్ మీడియాలో అంతగా కనిపించదు అనే మాట చాలా మంది నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆమె సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ తన అభిమానులను పలకరిస్తోంది. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తోంది. 'కూ' యాప్‌లో చేరిన వారం రోజుల్లోపే ఆమె దాదాపు పాతికవేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క శెట్టి ప్రేమ గొప్పతనాన్ని చెప్తూ ఒక పోస్టు చేసింది.
"దయచేసి.. జీవితంలో ప్రేమను అనుమతించండి. మీ భావాలను ఇతరులతో పంచుకోండి. మీకోసం ఉన్న మనుషులను గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో మంచితనం ఉందని తెలుసుకోండి. ప్రతి ఎడబాటులోనూ అందాన్ని కనుగొనేందుకు ప్రయత్నించండి. ముందుకు సాగడానికి ప్రయత్నించండి. 'నా' అనే వాళ్లతో మమేకమవండి. మీకు కన్నీళ్లు తెచ్చే క్షణాలను తలచుకోండి. మీరు సజీవంగా ఉండటం ఎంత అదృష్టమో తెలుసుకోండి. ఎందుకంటే ప్రతిరోజూ అందమైన విషయాలు అదృశ్యమవుతున్నాయి. మీ హృదయం వాటిలో ఒకటిగా ఉండనివ్వవద్దు" అని అనుష్క ఆ పోస్టులో పేర్కొంది.
అనుష్క 'నిశ్శబ్దం' తర్వాత తదుపరి సినిమా ప్రకటించలేదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమాల నుంచి ఆమె కాస్త విరామం తీసుకున్నారు. తర్వాత ప్రాజెక్ట్ కోసం అభిమానులు మాత్రం ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎక్కువగా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలవైపు మొగ్గు చూపిస్తున్న అనుష్క.. మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
'జాతిరత్నాలు' సెన్సేషన్ నవీన్ పొలిశెట్టికి జోడీగా అనుష్క ఓ సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. దాదాపు 20 ఏళ్ల వయసు వ్యత్యాసమున్న స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే స్వయంగా మరికొంత కాలం ఆగాల్సిందే మరి.!
ఇదీ చూడండి: సోషల్ వాచ్: బొద్దుగా అనుష్క.. హాట్‌గా ప్రగ్యా!