ప్రస్తుతం సినిమాలపై ఓటీటీల ప్రభావం ఎక్కువైనా.. థియేటర్లలో సినిమాలను చూసిన అనుభూతి వాటితో రాదని అభిప్రాయపడుతోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కరోనా కారణంగా ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల హవా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
"ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎప్పటి నుంచో ఉన్నా.. తాజా పరిస్థితుల్లో వాటికి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులకు బాగా చేరువై.. వారి నుంచి మంచి ప్రశంసలనూ అందుకుంటున్నాయి. ఇవి థియేటర్లపై కొంత ప్రభావాన్ని చూపగలవు. కానీ ప్రత్యామ్యాయాలు అవుతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సినిమాహాళ్లలో చూసిన అనుభూతి ఓటీటీలతో రాదు. బిగ్ స్క్రీన్ ద్వారానే ప్రజలు నిజమైన అనుభూతి పొందుతారు. అయితే ఈ డిజిటల్ వేదికలు రానున్న రోజుల్లో థియేటర్లకు పోటీగా ఓ కొత్త తరంగా మారతాయి".
- అనుష్కశర్మ, బాలీవుడ్ నటి
'క్లీన్ స్లేట్ ఫిలింస్' అనే నిర్మాణ సంస్థను తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి ప్రారంభించిన నటి అనుష్క శర్మ.. కొన్ని సినిమాలను నిర్మించింది. 'ఎన్‌హెచ్ 10', 'పారి', 'ఫిలౌరి' సినిమాలతో పాటు 'పాతాళ్ లోక్' అనే వెబ్‌సిరీస్‌కు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందుతోంది.
ఇదీ చూడండి... 'నాన్నకు ప్రేమతో': బాలీవుడ్ తారల పోస్టులు