తనపై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తమని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన పాయల్.. కశ్యప్ అబద్ధం చెబుతున్నాడని సోషల్‌మీడియాలో ఆరోపించింది. అతడి వద్ద నుంచి నిజాలు రాబట్టడానికి పాలిగ్రాఫ్ పరీక్ష లేదా నార్కో విశ్లేషణ నిర్వహించాలని ఆమె కోరింది.
"కశ్యప్.. పోలీసుల ముందు అబద్ధం చెప్పాడు. నిజం తెలుసుకోవడానికి అతడిపై నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్‌లను నిర్వహించాలని నా తరపు లాయర్ పోలీస్ స్టేషన్లో ఈరోజే దరఖాస్తు చేస్తున్నారు."
- పాయల్ ఘోష్, బాలీవుడ్ నటి
ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షాలను ట్యాగ్ చేసి 'బేటి బచావో' అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను జతచేసింది నటి పాయల్.
ఏం జరిగింది?
2013లో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని పాయల్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (ఐ), 354, 341, 342 కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అనురాగ్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు.. గురువారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. 2013లో పాయల్ వేధింపులు జరిగాయని ఆరోపించిన నాడు తాను అసలు భారత్‌లోనే లేనని దర్శకుడు ఆధారాలు చూపించాడని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
"నటి ఆరోపణల్ని అనురాగ్ పూర్తిగా ఖండించారు. తన స్టేట్‌మెంట్‌ను పోలీసులకు అందించారు. 2013 ఆగస్టులో అనురాగ్ తన సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాల్ని సమర్పించారు. అలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని, నటి వ్యాఖ్యలు అబద్ధాలని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు, విమర్శలు ఆయన్ను, కుటుంబ సభ్యుల్ని, అభిమానుల్ని ఎంతో బాధించాయి. ఈ నేపథ్యంలో అనురాగ్ కూడా తనకు జరిగిన నష్టానికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు, వ్యక్తిగత ఉద్దేశాల కోసం మీటూ ఉద్యమాన్ని వాడుకున్నందుకు నటిపై చర్యలు తీసుకోవాలని కోరారు."
- ప్రియాంక ఖిమణి, అనురాగ్ కశ్యప్ తరపు న్యాయవాది
2013 ఆగస్టులో అనురాగ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని పాయల్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని అనురాగ్ పేర్కొన్నాడు. అతడికి మద్దతుగా అనేక మంది సినీ ప్రముఖులు మాట్లాడారు. 'అనురాగ్ అలాంటి వ్యక్తి కాదని' మద్దతు తెలిపారు.