"జీవితం చాలా చిన్నది. ఉన్నప్పుడే ఆస్వాదించాలనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే మా చిత్రం" అన్నారు శ్రీను గవిరెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనుభవించు రాజా' (Anubhavinchu Raja Movie) . రాజ్‌తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటించారు. యార్లగడ్డ సుప్రియ నిర్మాత. ఈ నెల 26న (Anubhavinchu Raja Release Date) చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను గవిరెడ్డి (Anubhavinchu Raja Director) మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..
"ప్రతి మనిషిలోనూ అనుభవించాలనే ఓ కోరిక ఉంటుంది. నిజంగా అనుభవించడం అంటే ఏమిటో మా సినిమాలో ఆలోచన రేకెత్తించేలా చెప్పాం. మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు. మనం పుట్టిందే మన ఊరు అనే భావోద్వేగం చుట్టూ అల్లుకున్న ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. సరదాగా సాగుతూనే, చివర్లో హృదయాల్ని హత్తుకునేంతగా భావోద్వేగాలు ఉంటాయి. భీమవరంతోపాటు, సెక్యూరిటీ క్యాంప్‌కి వెళ్లి చిత్రీకరణ చేశాం. కోడి పందేల నుంచే ఈ కథ మొదలవుతుంది. కోడి పుంజుల్లో రకాలు ఏమిటి? ఏ పుంజు ఎప్పుడు పందెం ఆడుతుందనే విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకుని చిత్రీకరణ చేశాం. ప్రతీ ఏడాది కోడి పందేలకి వెళ్తుంటా. అది ఈ సినిమా తీయడానికి మరింత మేలు చేసింది."
-శ్రీను గవిరెడ్డి, దర్శకుడు
నాగార్జున, చైతూకి బాగా నచ్చింది..
"ఈ కథని నిర్మాత సుప్రియ తర్వాత నాగార్జున సర్, నాగచైతన్య విన్నారు. వాళ్లకి చాలా బాగా నచ్చింది. దాంతో ఈ సినిమా మొదలైంది. నేను అనుకున్న సినిమాని తెరకెక్కించా. ఎక్కడా ఎక్కువగా మార్పులు చేర్పులు చేయలేదు. అన్నపూర్ణ సంస్థలో చేయడం మరిచిపోలేని అనుభవం. చిత్రం విడుదలవుతున్న ఈ నెల 26 నుంచే సంక్రాంతి పండగ మొదలవుతుంది. అంత సందడి ఇందులో ఉంది. రాజ్‌తరుణ్‌తో పాటు అజయ్, నరేన్, అరియానా, రవికృష్ణ తదితరుల పాత్రలు చాలా బాగుంటాయి. ఉంగరాల జుత్తు ఉన్న అమ్మాయే కావాలి కాబట్టి కశిష్‌ఖాన్‌ని (Anubhavinchu Raja Heroine) ఎంపిక చేశాం. ఆమె నటన గుర్తుండిపోయేలా ఉంటుంది.
పూరి స్ఫూర్తితో..
పూరి జగన్నాథ్ స్ఫూర్తితోనే పరిశ్రమలోకి వచ్చా. పరిశ్రమ, సినిమాలు చాలా నేర్పించాయి. 2016లోనే రెండు సినిమాలు చేశా. అవి అంతగా ఆడలేదు. 'క్రాక్' సినిమాకి రచయితగా పనిచేశా. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకి ఓ రచయితగా పనిచేస్తున్నా. తదుపరి నా సినిమా పేరున్న ఓ నిర్మాణ సంస్థలోనే ఖరారైంది. ఆ వివరాలు ఆ సంస్థ నుంచే త్వరలోనే బయటికొస్తాయి."
ఇదీ చూడండి:
ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!